SP on gorantla video: ఆంధ్రప్రదేశ్ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించినదిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప పేర్కొన్నారు. ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఒరిజినల్ ఉంటేనే ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి, మార్ఫింగా.. కాదా? అనేది తేల్చగలమని అన్నారు. ఇప్పటివరకూ అది లభ్యం కాలేదని తెలిపారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఇప్పటివరకూ పంపించలేదని చెప్పారు. బాధితులు ముందుకొచ్చి ఒరిజినల్ వీడియో ఇస్తే దర్యాప్తు సులువవుతుందని వివరించారు. అయితే ఎవరూ ఇప్పటివరకూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో అనేకసార్లు ఫార్వర్డ్, రీ పోస్టు అయిందని తెలిపారు. అందుకే అది ఒరిజినలో కాదో చెప్పలేమన్నారు. అసలు వీడియో లభిస్తేనే తప్ప అందులో ఉన్నది ఎంపీ మాధవో కాదో తేల్చలేమని చెప్పారు. అనంతపురంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలివి..
అభిమాని ఫిర్యాదు మేరకు విచారణ:'ఎంపీ మాధవ్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గుర్తుతెలియని వ్యక్తులు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారంటూ ఆయన అభిమాని కొనతాలపల్లి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టాం. తొలుత 'ఐటీడీపీ అఫీషియల్' అనే వాట్సప్ గ్రూప్‌లో ఈ నెల 4వ తేదీ మధ్య రాత్రి 2.07 గంటల సమయంలో +447443703968 అనే నంబరు నుంచి ఈ వీడియో పోస్టు చేశారు. అంతకు కొన్ని క్షణాల ముందే ఆ నంబర్‌ను ఆ గ్రూపులో యాడ్ చేశారు. ఆ నంబరు యూకే (యునైటెడ్ కింగ్‌డమ్)కు చెందిన సిరీస్‌తో ఉంది. ఆ వాట్సప్ గ్రూపులో పోస్టు కాకముందే ఆ వీడియో ఐదుగురికి ఫార్వర్డ్ అయినట్లు ఉంది. వారిలో మొదటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అనేది తేలాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 67ఏ, 66ఈ, ఐపీసీ సెక్షన్ 292, 509 ప్రకారం కేసు నమోదు చేశాం. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న వీడియో ఒరిజినల్‌ది కాదు. ఎవరో ఒక వ్యక్తి స్క్రీన్ రికార్డు యాప్‌తో రికార్డు చేసిన వీడియోను ఇంకొకరికి పంపించారు. ఆ వ్యక్తి ఆ వీడియోను తన ఫోన్‌లో ప్లే చేసి చూస్తున్నప్పుడు మరో వ్యక్తి తన మొబైల్ ద్వారా దాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు.. కొంతమంది ఈ వీడియోకు ఎంపీ మాధవ్ ఫొటో జతచేసి ఫార్వర్డ్ చేశారు' అని ఎస్పీ తెలిపారు.
'ఎవరో ఫిర్యాదు చేస్తే ఎంపీ మొబైల్ సీజ్ చేయాలా?' విలేకరులకు ఎస్పీ ప్రశ్న..
విలేకరి:ఒరిజినల్ వీడియో ఎక్కడ ఉంది?
ఎస్పీ:ఎవరు రికార్డు చేశారనేది ఇప్పటివరకూ తేలలేదు. బాధితులు ఎవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదు. వారెవరైనా ఫిర్యాదు చేసి వీడియో ఇస్తే అప్పుడు దాన్ని ప్రయోగశాలకు పంపిస్తాం.
విలేకరి:ఎంపీ గోరంట్ల మాధవ్ ఫోన్ సీజ్ చేసి.. ల్యాబ్‌కు పంపించి విశ్లేషిస్తే నిజమేంటో వెలుగు చూసే అవకాశం ఉంది కదా!
ఎస్పీ:చట్ట ప్రకారం అది సాధ్యం కాదు. బాధితులెవరైనా తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే ఎంపీదే కాదు ఎవరి మొబైల్ అయినా సీజ్ చేస్తాం. అంతే తప్ప లేనిపోని వారెవరో ఫిర్యాదు చేశారని మొబైల్ సీజ్ చేయాలా?
విలేకరి:ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవేనా?
ఎస్పీ:అది మేం స్పష్టంగా చెప్పలేం. ఆ వీడియోపై సందేహాలున్నాయి. అది చాలాసార్లు ఫార్వర్డ్ అయ్యింది. రీ పోస్టు అయింది.
విలేకరి:అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదు.. నిజమైనదేనని నిపుణులు చెబుతున్నారు?
ఎస్పీ:నిపుణులు ఏదైనా చెప్పొచ్చు. మా దర్యాప్తులో తేలిందే మేము చెబుతున్నాం.