తెలంగాణ

telangana

ETV Bharat / city

Telugu Students at Ukraine: 'ఉక్రెయిన్​లో ఉన్న మా పిల్లలను స్వదేశానికి రప్పించాలి'

Telugu Students at Ukraine: ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థుల రక్షణపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను స్వదేశానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

By

Published : Feb 25, 2022, 1:01 PM IST

Telugu Students at Ukraine:
Telugu Students at Ukraine:

'ఉక్రెయిన్​లో ఉన్న మా పిల్లలను స్వదేశానికి రప్పించాలి'

Telugu Students at Ukraine: ఉక్రెయిన్‌లో చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు.. వారి భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్, రొళ్ల మండలం హెచ్.టి.హళ్లి గ్రామానికి చెందిన తేజ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్​ చివరి సంవత్సరం చదువుతున్నారు. వారిని స్వదేశానికి రప్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై గురువారం రష్యా బాంబు దాడులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి విదేశీ విద్యార్థులు ఈ హఠాత్పరిణామానికి హతాశులయ్యారు. బుధవారం రాత్రి వరకు ఉక్రెయిన్‌లో జనజీవనం ప్రశాంతంగా సాగింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా యుద్ధం మొదలవడంతో తమ పరిస్థితి ఏమిటో అర్థంకాక ఆ దేశంలోని తెలుగువారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉక్రెయిన్‌లోని వైద్య కళాశాలల్లో సుమారు 1500 మంది తెలుగువారు చదువుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వందల మంది మెడిసిన్‌ చదవడానికి వెళ్తున్నారు. వారిలో అత్యధికులు ఉక్రెయిన్‌ అధికారులు చెప్పిన మాటలు విని భారత ప్రభుత్వం విమానాలు ఏర్పాటు చేసినా వెనక్కి రాకుండా అక్కడే ఉండిపోయారు. భారత్‌ వచ్చేయాలని కొందరు భావించినా విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా నిర్ణయించడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. వెనక్కి వచ్చేయాలని భావించిన కొందరికి విమాన టికెట్లు మార్చికి గానీ దొరకలేదు. ఒక్కసారిగా గురువారం నుంచి యుద్ధం ప్రారంభం కావడం, విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వారందరూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

కంపించిన భవనాలు

రష్యా సరిహద్దుకు 30 కి.మీ.ల దూరంలో ఉన్న ఖార్‌కీవ్‌ నగర శివార్లలో గురువారం తెల్లవారుజాము నుంచి బాంబులు పడటంతో వాటి తీవ్రతకు భవనాలు కంపిస్తున్నాయని అక్కడున్న తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. భవనాలు కూలిపోతాయేమోనని చాలామంది ఆరుబయటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఖార్‌కీవ్‌ నగరంలో అత్యధిక సూపర్‌ మార్కెట్లను, దుకాణాలను మూసేశారు. తెరిచి ఉన్న అతికొద్ది దుకాణాల ముందు వందలాది మంది బారులు తీరారు. పలు దుకాణాల్లో సరకులు కూడా అయిపోయాయి. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు కోసం భారీగా బారులు తీరుతున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయని అక్కడి విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పారు.

ఉక్రెయిన్‌ అధికారులు నిలువునా ముంచేశారు..

ఉక్రెయిన్‌ అధికారులు తమను నిలువునా ముంచేశారని పలువురు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వస్తుందన్నది అవాస్తవ ప్రచారమని అధికారులు నమ్మబలికారు. దీంతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు వారి వారి పౌరుల్ని వెనక్కి వచ్చేయాలని విమానాలు ఏర్పాటు చేసినా చాలామంది పట్టించుకోలేదు. కనీసం సరకులు కూడా నిల్వ చేసుకోలేదు. అత్యధిక మంది తెలుగు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో నిత్యం వాట్సప్‌ కాల్‌ చేసి మాట్లాడుతుంటారు. తాజాగా ఖార్‌కీవ్‌ నగరంలో అంతర్జాల సమస్యలు కూడా తలెత్తాయి.మధ్యమధ్యలో అంతర్జాల సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు కనీసం ఇంట్లో వారికి తమ క్షేమసమాచారం చెప్పగలమా లేదా అని దిగులుపడుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details