తెలంగాణ

telangana

ETV Bharat / city

AMIT SHAH : అనేక పదవులకు వెంకయ్యనాయుడు వన్నె తెచ్చారు: అమిత్‌షా

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎప్పుడూ రైతు సంక్షేమం గురించే ఆలోచిస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. రైతుల కోసం ఏదైనా చేయాలనేది వెంకయ్యనాయుడి తపనని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వెంకయ్య చాలా కృషిచేశారన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో వెంకయ్యనాయుడుతో కలిసి అమిత్​షా పాల్గొన్నారు.

AMIT SHAH
AMIT SHAH

By

Published : Nov 14, 2021, 12:44 PM IST

భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనియాడారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారన్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి వెంకయ్యనాయుడితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.

‘‘రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని వెంకయ్య పరితపిస్తుంటారు. మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ ఎంచుకున్నారు. వెంకయ్య విద్యార్థి స్థాయి నుంచే నాయకుడిగా ఉన్నారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో ఉన్నతస్థాయి చర్చల్లో వెంకయ్య చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచించేవారు. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న నా అభిలాష నెరవేరింది’’ అని అమిత్‌షా అన్నారు.

ఇదీచూడండి:TSRTC : చిల్డ్రన్స్​కు ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌... టికెట్‌ లేకుండానే ప్రయాణించొచ్చు!

ABOUT THE AUTHOR

...view details