దేశంలోనే అతి పెద్ద ఇంటర్ చేంజింగ్ స్టేషన్ అమీర్‌పేట... అలాంటి మెట్రో స్టేషన్ పిల్లర్ పెచ్చులు ఊడిపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అమీర్‌పేటలోని ప్రైమ్ ఆస్పత్రిలో తమ బంధువులను చూడటానికి తన సోదరితో కలిసి వచ్చిన మౌనిక తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సుకోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో వర్షం రావడం వల్ల పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ కింద్ర నిలబడింది. మెట్రో స్టేషన్ పిల్లర్‌కు ఉన్న పెచ్చులు ఒక్క సారిగా మౌనిక తలపై బలంగా పడటం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే దగ్గరలోని ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోవడం వల్ల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇటీవలే మౌనికకు వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఆస్పత్రితో ఉన్న తమ వారిని పరామర్శించి వెళ్లేందుకు వచ్చిన ఆమె అదే ఆస్పత్రిలో విగతజీవిగా పడి ఉండటం వల్ల మౌనిక బంధువులు ఆస్పత్రి వద్ద తీవ్రంగా రోధిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీకి తరలించారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.