RUIA Hospital Incident : తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్ డ్రైవర్లు మాఫియాలా తయారయ్యారు. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఓ అభాగ్యుడితో అమానవీయంగా వ్యవహరించారు. వేలరూపాయల ఛార్జీ భరించలేనని మొత్తుకున్నా కనికరించలేదు. అతని యజమాని తక్కువ ధరకు అంబులెన్స్ మాట్లాడి పంపితే.. అడ్డుకున్నారు. చేసేది లేక కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరాల్సి వచ్చింది. హృదయవిదారకమైన ఈ ఘటన రుయా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీ కేసీ ఎస్టీ కాలనీకి చెందిన కంభంపాటి నరసింహులు తన కుమారుడు జాషువా(10)ను కిడ్నీ సమస్య కారణంగా ఈ నెల 24న రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి బాలుడు మృతి చెందాడు.
Tirupati RUIA Hospital Incident : మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆసుపత్రి ప్రాంగణంలోని అంబులెన్స్‌లను విచారించారు. కొండూరుకు వెళ్లడానికి రూ. 20,000 అడిగారు. కూలి పని చేసుకుని బతికే అతడు అంత డబ్బులు ఇవ్వలేక ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ చేసి చెప్పి ఆవేదన చెందాడు. 110 కి.మీ. దూరానికి అంత డబ్బు ఎందుకన్న ఆయన.. ఆన్‌లైన్‌లో పరిశీలించి రూ. 5,000కు ఓ అంబులెన్స్ మాట్లాడి రుయా వద్దకు పంపించారు. అక్కడే ఉన్న అంబులెన్స్ మాఫియా ఆ వాహనాన్ని అడ్డుకుంది. డ్రైవర్‌ను బెదిరించింది. చేసేది లేక రాత్రి వేళ నరసింహులు కొడుకు మృతదేహాన్ని భుజాలపై వేసుకుని ఆసుపత్రి బయటికి వచ్చారు. అంబులెన్స్‌తో పాటే వచ్చిన దాని యజమాని తన ద్విచక్ర వాహనంపై ఎక్కమని కోరారు. సుమారు 12 కి.మీ. ప్రయాణించి అక్కడ తాము మాట్లాడుకున్న అంబులెన్స్‌లో ఎక్కించి మృతదేహాన్ని తన సొంత ఊరికి తీసుకెళ్లారు.
అధికారులపై సస్పెన్షన్ వేటు :మంగళవారం ఉదయం ఈ వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి వెంటనే స్పందించారు. ఆర్డీవో కనక నరసారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీహరి, డీఎస్పీ మురళీకృష్ణతో కమిటీ వేసి వెంటనే ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వారు రుయా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఇదే సమయంలో అఖిలపక్ష నేతలు అధికారులను అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విచారణ జరిపిన కమిటీ సభ్యులు ప్రైవేటు అంబులెన్స్ మాఫియా నిజమేనని నిగ్గుతేల్చారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్ ఆర్‌ఎంవో సరస్వతీదేవిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆర్డీవో, ఆర్టీవో, పోలీసు, డీఎంహెచ్‌ఓలతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించి ఆస్పత్రిలో ప్రదర్శిస్తామని తెలిపారు. అంబులెన్స్‌ను అడ్డుకున్న నరసింహులు, కృష్ణమూర్తి, సురేష్, ప్రభు, శేఖర్, దొరైరాజ్‌లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
గతంలోనూ ఇదే తీరు:2020లో రుయా అత్యవసర విభాగంలోని ఓ రోగిని విశాఖకు తీసుకెళ్లడానికి ఇక్కడి అంబులెన్స్ అసోసియేషన్ సభ్యులు రూ.15,000 అడిగారు. రోగి బంధువులు బయట వేరే వాహనాన్ని రూ.8,000కు మాట్లాడుకుని తీసుకురాగా, మాఫియా సభ్యులు ఆ వాహనం డ్రైవర్‌పై దాడికి దిగారు. 2021లో ఓ రోగిని చెన్నైకి తరలించేందుకు రుయాకు బయటి అంబులెన్స్‌ను అడ్డుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.అదే ఏడాది కొవిడ్ సమయంలో ఓ మృతదేహాన్ని తరలించడానికి ప్రైవేటు అంబులెన్స్ యజమాని రూ.10,000 అడిగాడు.