ఏపీలో జరిగిన పురపోరులో ప్రతిష్టాత్మకంగా భావించిన విజయవాడ నగరపాలికలో వైకాపా తిరుగులేని ఆధిక్యం సాధించింది. నగరంలోని 64 డివిజన్లలో 49 స్థానాలను గెలుచుకొని విజయకేతనం ఎగురవేసింది. రాజధాని అమరావతి అంశం ప్రభావం చూపుతుందని భావించినా.. ఫలితాల్లో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి. తూర్పు నియోజకవర్గంలోనే తెదేపా కాస్త ఫర్వాలేదనిపించింది. మొత్తం గెలిచిన 14 మంది అభ్యర్థుల్లో ఈ నియోజకవర్గం నుంచే ఏడుగురు గెలుపొందారు. విజయవాడ సెంట్రల్లో 4, పశ్చిమలో 3 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం డివిజన్లలో తెదేపా 10వ డివిజన్ అభ్యర్థి దేవినేని అపర్ణ అత్యధికంగా 2వేల 640ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
విజయవాడ నగరపాలికలో తిరుగులేని గెలుపు సొంతం చేసుకున్న వైకాపా.. ప్రస్తుతం మేయరు పీఠంపై దృష్టి సారించింది. ఎన్నికలకు ముందు మేయరు అభ్యర్థిని ప్రకటించని సీఎం జగన్.. ఎన్నికల తర్వాతే ఎంపిక చేయాలని భావించారు. ఇప్పుడు ఈ పదవి ఎవరికి దక్కుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆశావహులు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మేయరు పీఠాన్ని ఆశించిన వైకాపా నేత గౌతంరెడ్డి కుమార్తె.. డాక్టర్ లిఖితారెడ్డి ఓడి పోవడం వల్ల పోటీ తగ్గినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం 34వ డివిజన్ నుంచి విజయం సాధించిన బండి నాగపుణ్యశీల పేరు మేయర్ పరిశీలనలో ఉంది. గత కౌన్సిల్‌లో ఫ్లోర్ లీడర్‌గానూ పని చేసిన ఆమె.. సీఎం జగన్ తనకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.