ఏపీలోని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినిపట్నం గ్రామ పరిధిలోని 211 హెక్టార్లలో సిలికా శాండ్ తవ్వకాలు సాగించాలని ఏపీఎండీసీ నిర్ణయించింది. ఇసుక ఉన్న ప్రాంతాన్ని 47 లీజులుగా విభజించి టెండరు పిలవగా.. అవంతిక కాంట్రాక్ట్స్ ఇండియా లిమిటెడ్ టన్నుకు రూ.212 చొప్పున ఏపీఎండీసీకి చెల్లించేలా కోట్ చేసి టెండరు దక్కించుకుంది. ధరావతునూ చెల్లించింది. తొలుత 10 లీజుల్లో తవ్వకాల కోసం అటవీ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకునే ప్రక్రియ జరుగుతుండగా.. ఇప్పుడు ఏపీఐఐసీ కొత్త మెలికతో తవ్వకాలపై సందిగ్ధం నెలకొంది.
ఏపీలో సిలికా శాండ్ తవ్వకాలపై సందిగ్ధత.. - సిలికా శాండ్ తవ్వకాలపై సందిగ్ధత తాజా వార్తలు
ఏపీలోని నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ తవ్వకాలు, విక్రయాల కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) టెండర్లు పిలవగా, ఓ గుత్తేదారు సంస్థ బిడ్ దక్కించుకుంది. ఇప్పుడు సిలికా శాండ్ కోసం కేటాయించిన భూములకు పరిహారం ఇస్తేనే, వాటిని ఖాళీ చేయించి అప్పగిస్తామని ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కొత్త మెలిక పెట్టడంతో ఏపీఎండీసీ సందిగ్ధంలో పడింది.
సిలికా శాండ్ కోసం కేటాయించిన భూముల్లో అసైన్డ్, మరికొంత పట్టా భూములు ఉన్నాయి. వీటిలో అసైన్డ్ భూములకు ఎకరాకు రూ.10 లక్షలపైన, పట్టా భూములకు ఎకరాకు రూ.20 లక్షలకుపైగా పరిహారం ఇవ్వాలని ఏపీఐఐసీ పేర్కొన్నట్లు తెలిసింది. అప్పుడే ఆ భూములను ఖాళీచేయించి అప్పగిస్తామని చెప్పినట్లు సమాచారం. పరిహారం ఇస్తే సిలికా శాండ్ తవ్వకాలు ఏమాత్రం గిట్టుబాటు కావని ఏపీఎండీసీ చెబుతోంది. 2 మీటర్ల మేర ఇసుక తవ్వకాలు జరిపి, మళ్లీ భూములను వెనక్కి ఇచ్చేస్తామని పేర్కొంటోంది. ఏపీఐఐసీ అధికారులు మాత్రం పరిహారం ఇవ్వకపోతే స్థానికంగా అభ్యంతరాలు వస్తాయని చెప్పినట్లు తెలిసింది. ఇరు సంస్థల అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై స్పష్టత వచ్చే వరకూ సిలికా శాండ్ తవ్వకాల ప్రక్రియ ముందుకుసాగే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
- ఇదీ చదవండి :వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం