భూమి మీదే.. వైకుంఠాన్ని తలపించేలా... వైభవంగా సాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. కొవిడ్ ప్రభావంతో... గడచిన 5 నెలలుగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించటమేగాక... వార్షిక ఉత్సవాలనూ ఏకాంతంగానే నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో తిరుమాడ వీధుల్లో వివిధ వాహనాలపై విహరించే మళయప్పస్వామిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు దాదాపు 4 లక్షల మంది వస్తారు. కరోనా మరింత వ్యాపించే అవకాశముందని తితిదే భావిస్తుండటంతో... ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.
భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. - తిరుమల బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు
తిరుమల బ్రహ్మోత్సవాలు అంటేనే ఓ వైభవం. సాధారణంగానే కిటకిటలాడే తిరుమల గిరులు... బ్రహ్మోత్సవం సమయంలో ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోతాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండానే జరిగే అవకాశముంది. అధిక మాసంలో రెండుసార్లు జరగాల్సిన ఉత్సవాలు... ఏకాంత సేవల్లానే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి.
![భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. thirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8484344-1107-8484344-1597864107937.jpg)
ఈ ఏడాది అధిక మాసం రావటంతో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉంది. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27 వరకు... నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 16 నుంచి 24 వరకు జరగాలి. ఇప్పటికే అమలవుతున్న అన్‌లాక్ ప్రక్రియ నిబంధనలు ఆగస్టు వరకే కేంద్రం ప్రకటించటంతో... సెప్టెంబర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించబోయే నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా తిరుమల గిరులను సుందరంగా తీర్చిదిద్దుతూ... తితిదే ఏర్పాట్లు చేసేది. ఇప్పుడు ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత ఉండటంతో... ఈ నెల ఆఖర్లో జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశం తరువాతనే ఏర్పాట్లపై స్పష్టత ఇవ్వనుంది.