ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చియార్డులో వ్యాపార లావాదేవీలు నిర్వహించే కమీషన్ ఏజెంట్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల క్రయవిక్రయాలు కొనసాగించే విషయమై సందేహాలు తలెత్తుతున్నాయి. బ్రాడీపేటకు చెందిన ఓ కమీషన్ ఏజెంట్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలడం వల్ల ఆయన్ని ఎన్నారై ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఆయన గురు, శుక్రవారాలు కూడా యార్డుకు వచ్చి పలువుర్ని కలిశారంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఎగుమతి, దిగుమతి వ్యాపారులతో పాటు గుమస్తాలు, హమాలీల్లో ఆందోళన నెలకొంది.
రెండు నెలలు పాటు సెలవులు
లాక్‌డౌన్ కారణంగా మిర్చియార్డుకు రెండు నెలలు పాటు సెలవులు ప్రకటించి మిర్చి లావాదేవీలను నిలిపివేయగా.. గత నెల 25న లావాదేవీలను పునఃప్రారంభించారు. కొన్ని రోజులకే ఇక్కడ పని చేసే హమాలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటం వల్ల ఈనెల 7 వరకు సెలవులు ప్రకటించారు. ఈనెల 8 నుంచి మళ్లీ లావాదేవీలు ప్రారంభించారు. ప్రస్తుతం కమీషన్ ఏజెంట్‌కు కరోనా పాజిటివ్‌గా తేలటం వల్ల మరో కోయంబేడు అవుతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఈ నేపథ్యంలో పాలకవర్గం, అధికార యంత్రాంగం యార్డులో కరోనా నివారణ చర్యలను ముమ్మరం చేశారు.