Prisoners got Gold Medal in PG : తెలిసో తెలియకో తప్పు చేసి జైలుకు వచ్చారు. జైలుకు వచ్చినంత మాత్రాన వారు కుంగిపోలేదు.. చదవాలనే లక్ష్యం వారిని ముందుకు నడిపించింది.. జైల్లో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ చదివారు.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఏకంగా గోల్డ్ మెడల్ సాధించారు.
రమేశ్- సురేశ్.. రియల్ లైఫ్ 'స్టూడెంట్స్ నంబర్ వన్' - కడప జిల్లా తాజా వార్తలు
Prisoners got Gold Medal in PG: ఓ కేసులో ఓ వ్యక్తి జైలుకు వస్తాడు. చేయని నేరానికి కారాగారానికి వచ్చిన ఆ వ్యక్తి తన జైలు జీవితం వృథా కాకూడదని.. జైలర్ అనుమతితో లా చదువుతాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టువదలకుండా లాలో పట్టభద్రుడవుతాడు. చివరకు తను వాదించే మొదటి కేసు తన తండ్రిదే అవుతుంది. ఇదంతా వింటుంటే ఏదో సినిమా కథ విన్నంటుంది కదా.. విన్నంటు కాదు సినిమా కథే స్టూడెంట్ నం.1. ఇప్పుడు దీని గురించి ఎందుకంటారా..? తెలిసో తెలియక తప్పు చేసి జైలుకు వచ్చిన కొందరు ఖైదీలు.. జైలు జీవితాన్ని వృథా చేసుకోకుండా.. తమ చదువును కొనసాగించారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని గోల్డ్ మెడల్ సాధించారు. ఇది జరిగిందెక్కడో తెలుసా..?
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన సురేశ్‌రెడ్డి 2018లో హత్య కేసులో కడప కేంద్ర కారాగారానికి వెళ్లాడు. కేంద్ర కారాగారానికి రాక మునుపే డిగ్రీ పూర్తి చేశాడు. జైలుకు వచ్చాక ఎలాగైనా విద్యను అభ్యసించాలని జైల్లో ఉన్న అంబేడ్కర్ దూర విద్య ద్వారా పీజీ సోషియాలజీ తీసుకున్నాడు. కష్టపడి చదివి రెండేళ్లు పూర్తి చేసి 1000కి 738 సాధించడంతో.. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అతడికి గోల్డ్ మెడల్ ప్రకటించింది.
వైయస్సార్ జిల్లా చెన్నూరుకు చెందిన రమేశ్ బాబు సైతం ఓ హత్య కేసులో 2017లో కడప కేంద్ర కారాగారానికి వచ్చాడు. తను కూడా ఇది వరకే డిగ్రీ పూర్తి చేశాడు. జైలుకు వచ్చాక ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ పూర్తి చేశాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రమేష్ బాబుకు 1000కి 767 మార్కులు వచ్చాయి. ఇతనికి కూడా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బంగారు పతకాన్ని ప్రకటించింది. అయితే.. రమేశ్ బాబుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లలేకపోయాడు. సురేశ్ రెడ్డి.. హైదరాబాద్‌లో పతకాన్ని అందుకోనున్నారు. వీరికి బంగారు పతకాలు రావడంపై జైలు అధికారులు హర్ష వ్యక్తం చేశారు.