Konaseema riots : కోనసీమ జిల్లాకు డా.బీఆర్.అంబేడ్కర్ పేరు పెడుతుంటే అల్లర్లు చేయడం సరికాదని అంబేడ్కర్ మునిమనవడు రాజారత్నం అన్నారు. ఇటీవల అమలాపురంలో జరిగిన అల్లర్లకు నిరసనగా.. అంబేడ్కర్ వాదుల ఆత్మగౌరవ పోరాట ఐకాస ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో నీలికవాతు నిర్వహించారు.
‘బీఆర్ అంబేడ్కర్ దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన పిల్లలు, భార్య మృతి చెందినా ఒక్క క్షణం కూడా వారికోసం కేటాయించలేదు. దేశం కోసమే ఆయన అహర్నిశలు శ్రమించారు. బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక జిల్లాకు ఆయన పేరు పెడుతుంటే అల్లర్లు సృష్టిస్తున్నారు. మరోవైపు జమైకా దేశంలో ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరును పెట్టి గౌరవించారు. కోనసీమ అంబేడ్కర్ జిల్లా అని కాకుండా అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి ఏపీలో నిషేధించాలి’ అని బహిరంగ సభలో రాజారత్నం అంబేడ్కర్ డిమాండ్ చేశారు.
దళితుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించవద్దని.. సమతా సైనిక్ దళ్ నేత ఉమామహేశ్వరరావు అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగతోనే ఎంతో మంది పదవులు అనుభవిస్తున్నారన్నారు. అంబేడ్కర్‌కి అవమానం జరిగినా వారు స్పందించరా అని ప్రశ్నించారు. ఎన్నో జిల్లాలకు ఎంతో మంది పేర్లు పెట్టినా వివాదం లేదని, కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఘర్షణలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాజకీయాలకు అతీతంగా నీలి కవాతు నిర్వహించామన్నారు. ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు కవాతుకు మద్దతు పలికారు. ప్రదర్శన సందర్భంగా పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సెల్‌ఎత్తిన అభిమానం..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మునిమనవడు రాజారత్న అంబేడ్కర్‌ను కలుసుకునేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. వేదికపై ఉన్న ఆయనతో కిందనున్న యువకులు సెల్‌ఫోన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపడంతో వారి ఫొటోల్లో పడేలా కూర్చొని సహకరించారు. దీంతో కవాతుకు వచ్చిన వారు పోటీపడి సెల్ఫీలు తీసుకున్నారు.