Amazon Future Engineers Program: సాంకేతిక విద్యలో రాణించడం, అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో సత్ఫలితాలు సాధించవచ్చనే నిపుణుల సూచనలను ఆచరణలో పెట్టారు ఆదివాసీ గిరిజన బాలికలు. పేదరికంలో మగ్గుతూ అరకొర వసతుల మధ్య ప్రభుత్వ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ప్రముఖ కంపెనీ అమెజాన్ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్సార్) నిధులతో అమలు చేస్తున్న కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఏటా రూ. 2.50 కోట్లు ఖర్చు: రాష్ట్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న ఆదివాసీ గిరిజన విద్యార్థినులకు కంప్యూటర్ సాంకేతిక విద్యను అందించడంపై రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 25 ఆశ్రమ, 25 గురుకులాలు కలిపి మొత్తం 50 పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థినులకు సాంకేతిక శిక్షణ కల్పించడంపై దృష్టిసారించింది. సీఎస్సార్ కింద అమెజాన్ కంపెనీ ఏటా రూ.2.50 కోట్ల నిధులతో ఎడ్యుకేషనల్ ఇన్‌సెంటివ్ కంపెనీ సహకారంతో ఈ ఏడాది జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.