Amaravati JAC: ఈనెల 17న అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించబోయే సభకు అనుమతిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంకా స్పందించలేదని అమరావతి ఐకాస నేతలు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాము సమాధానాలు పంపినట్లు పేర్కొన్నారు. సభకు అనుమతిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్న నేతలు.. అనుమతి త్వరగా ప్రకటిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని వెల్లడించారు. తిరస్కరిస్తే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను గౌరవించి.. తితిదే సంప్రదాయాలకు అనుగుణంగా మాకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించండి. ఒకేసారి 500 మందికి దర్శనం కల్పించడానికి ఇబ్బందులు ఎదురైతే.. విడతల వారీగా అయినా కల్పించాలని వేడుకుంటున్నాం. కరోనా నిబంధనలు పాటిస్తాం. దయచేసి ఈ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టొద్దు. రాజధాని అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేం చేస్తున్న ఉద్యమం ఇది. -గద్దె తిరుపతి రావు, అమరావతి ఐకాస నేత