AMARAVATI WOMEN FARMERS: ఓర్పు, సహనం..ఈ రెండూ నశిస్తే జరిగేది సమరమే..! అమరావతిలో అదే జరిగింది. ఆకాంశమంత సహనం, భూదేవి అంత ఓర్పుతో ఉండే.. మహిళలు పోలీస్ కేసులు, లాఠీల దెబ్బలతో రాటుదేలారు. అమరావతిని ఆగం చేస్తే సహించేది లేదంటూ.. ఒక్కొక్కరు ఒక్కో రాణిరుద్రమలా కదంతొక్కారు. ఇవి కాళ్లకు తగిలిన దెబ్బలు..! ఇవి మనసుకు తగిలిన గాయాలు.! బొబ్బలెక్కిన పాదాలు.. విశ్రాంతి కోరితే..! మనసుకు తగిలిన గాయాలు విశ్రమించొద్దన్నాయి. అందుకే అమరావతి మహిళల అడుగులు ముందుకే పడ్డాయి.
Amaravati padayatra: అమరావతి ఉద్యమ దీపాన్ని.. రెండేళ్లుగా అఖండ జ్యోతిలా వెలిగిస్తోంది నారీమణులే.! లాఠీలతో కొడితే ఆకాశమంత ఓర్పు.. జుట్టుపట్టి ఈడ్చుకెళ్తే భూదేవి అంత సహనం ప్రదర్శించారు. కానీ.. పెయిడ్ ఆర్టిస్టులంటే సహించలేదు. ఇల్లు, పొలమే లోకంగా బతికిన మహిళలు రోడ్డెక్కారు. ఊళ్లకు ఊళ్లు.. దాటారు. మైళ్లకు మైళ్లు నడిచారు. ఉద్యమ నినాదాన్ని సేవ్ అమరావతి నుంచి.. బిల్డ్ అమరావతిగా మార్చుకుని ముందుకు తీసుకెళ్తున్నారు.
అమరావతి మహిళల అడుగులు.. పాదయాత్రలో amaravathi protest: పాదయాత్రలో మహిళలు ఒక జీవితకాలానికి సరిపడా కష్టాలు ఎదుర్కొన్నారు. వరదైనా, బురదైనా పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడే బైఠాయించారు. ఎక్కడ బస దొరికితే అక్కడేఉన్నారు. ఏది వండితే అదేతిన్నారు. ఎండైనా నడిచారు. వానైనా అడుగు ముందుకే వేశారు. కాళ్లు బొబ్బలెక్కితే రాత్రి ఆయింట్‌మెంట్ రాసుకోవడం.. ఉదయం మళ్లీ నడవడం..! అలా పాదాలు విశ్రాంతి కోరితే లక్ష్యం ముందుకు నడిపించింది. హరిత పతాకం రెపరెపలాడిస్తూ తమ గుండె ఘోషను దారి పొడవునా.. వినిపించారు మహిళలు. ఇది మా సమస్యకాదు.. మనందరి సమస్య అంటూ గళమెత్తారు.
womens in padayatra:జీవనాధారమైన పొలాలను రాజధాని కోసం ఇవ్వాలనే.. నిర్ణయంలో మహిళలదే ప్రముఖపాత్ర.! అలాంటిది కుటుంబంతోపాటు.. బిడ్డల భవిష్యత్తుకూ కష్టం వస్తే స్పందించకుండా ఉండలేకపోయారు. తాడోపేడో.. తేల్చుకోడానికే రోడ్డెక్కారు. రాజధాని కోసం పది, ఇరవై సెంట్ల భూములిచ్చిన చిన్న, సన్నకారు రైతు కుటుంబాల్లోని.. మహిళలు, వారి పిల్లలే పాదయాత్రను ముదుండి నడిపించారు. కొందరైతే ఊళ్లలో ఇళ్లకు తాళాలు వేసి..భార్య,భర్తలు పాదయాత్రకే అంకితం అయ్యారు. అనంతవరానికి చెందిన పార్వతి క్యాన్సర్‌తో బాధపడుతూనే భర్తతో కలిసి నడిచారు. మరో మహిళ రత్నకుమారి యాత్రలో జారిపడి చెయ్యి విరిగినా విశ్రమించకుండా.. వెంకన్న సన్నిధిదాకా యాత్ర కొనసాగించారు. మనసుకు తగిన గాయాల కంటే ఇవేమీ పెద్దవి కావంటూ తమకంటే చిన్నవయస్కుల్లో ఉత్సాహం నింపారు.
700 రోజులకుపైబడిన ఉద్యమంలో.. అసెంబ్లీ ముట్టడి, జాతీయ రహదారి దిగ్బంధం, దుర్గమ్మ దర్శనం.. మరే కార్యక్రమమైనా ముందుంది మహిళలే. ఇప్పుడు పాదయాత్రనూ దిగ్విజయంగా పూర్తి చేసి.. తిరుమల వెంకన్నకు ముడుపు చెల్లించారు. ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతినబూనారు.