ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని... రాజధాని రైతులు కదిలారు. మొన్న మద్రాసు మీది కాదు పొమ్మన్నారు.. నిన్న హైదరాబాద్‌పైనా ప్రేమను తెంచుకోమన్నారు.. తరాలుగా రాజధాని శాపం వేధిస్తున్న వేళ.. మనదైన రాజధాని కావాలని యావత్ ఆంధ్రావని బలమైన సంకల్పంతో.. అమరావతి నిర్మాణానికి పునాది రాయి పడింది. కానీ.. అదే సమాధి రాయిగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆంధ్రులు కలలోనూ ఊహించలేదు! సొంతవాళ్లే రాజధానిని కూల్చే సాహసం చేస్తారని పసిగట్టలేదు! ఈ ఊహాతీతమైన చర్యవల్ల కలిగిన బాధను పంటి బిగువు భరిస్తూ.., భయాన్ని గుండెల్లోనే దాచుకుంటూ.. అమరావతి స్వప్నాన్ని తలుచుకుంటూ.. రెండేళ్లుగా సుదీర్ఘ దీక్ష కొనసాగించిన అమరావతి రైతులు.. ఇప్పుడు జనాల్లోకి కదిలారు.
600 రోజులకు పైబడి అప్రతిహతంగా సాగుతున్న దీక్ష.. కేవలం పాతిక ఊళ్లకే పరిమితమైందన్నారు. కానీ.. ఇవాళ మొదలుపెట్టిన పాదయాత్ర(Amaravati padayatra).. కడలి తరంగమై ఉవ్వెత్తున ఎగసిపడుతోందని, ఆ సజీవ సాక్ష్యాన్ని చూడమని కోరుతున్నారు రైతులు. రాజధాని అమరావతిపై జనాల్లో ఉన్న ఆశ, ఆకాంక్ష స్థాయి ఏంటన్నది రైతులు, మహిళల పాదయాత్ర బయటపెడుతోందని అంటున్నారు. దారిపొడవునా పూల స్వాగతం.. జనాల నీరాజనమే అమరావతిపై వారికున్న ప్రేమను చాటిచెబుతున్నాయి. అధికార పక్షం మినహా.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతుతో అమరావతి మహా పాదయాత్ర రణన్నినాదాన్ని తలపిస్తూ.. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ శంఖారావం చేస్తూ ముందుకు సాగుతోంది.