తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏడాదిగా అలుపెరగని పోరాటం....అమరావతే నినాదం

ఎవరైనా అన్యాయం చేస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటాం! కానీ ఆ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తే ఎవరితో గోడు వెళ్లబోసుకోవాలి? హామీలు, ఒప్పందాలు నమ్మి భూములిచ్చి ఇప్పుడు నడిరోడ్డున నిలబడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మాకు దిక్కెవరు? ఏపీ రాజధాని కోసం భూములు ఇచ్చిన వేలాది అమరావతి రైతుల ఆక్రందన ఇది. చెప్పిన నవనగరాలు లేవు. మూడేళ్లలో చేస్తామన్న అభివృద్ధి లేదు... అసలు ఆ ఒప్పందాలు చేసిన సీఆర్డీఏనే లేదంటే ఇక ఏం చేయాలి? ఎలా తట్టుకోవాలి? అని వారందరూ గుండెమంటను వ్యక్తం చేస్తున్నారు.

amaravathi
ఏడాదిగా అలుపెరగని పోరాటం....అమరావతే నినాదం

By

Published : Dec 16, 2020, 10:53 PM IST

ఈ ఇద్దరే కాదు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతిచోట రైతుల ఆక్రోశం ఇదే ఇప్పుడు. నమ్మి భూములు ఇస్తే నట్టేట ముంచుతారా అని వారంతా ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఒప్పందం మేరకు నెరవేర్చాల్సిన హమీలు తీర్చకపోతే చట్టపరమైన చర్యలకు సైతం సిద్ధమని ఏడాదిగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని అంటేనే భూములు ఇచ్చామని... ఇప్పుడు అదే మాట ఏపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రైతులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఇరువురి అంగీకారంతో కుదిరిన ఒప్పందాన్ని ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తారని నిలదీస్తున్నారు.

అలుపెరగని పోరాటంలో రైతులు మొదట్నుంచి చేస్తున్న ప్రధాన డిమాండ్ ఒక్కటే. ఆనాడు సీఆర్డీఏతో జరిగిన ఒప్పందం ప్రకారమే అన్ని విధాల అభివృద్ధి చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమరావతి రైతులు. పార్కులు, రోడ్లు, పాఠశాలలు, వైద్య కళాశాలలు, గృహనిర్మాణం... అన్నీ చెప్పిన ప్రకారమే చేయాలని కోరుతున్నారు.

మా హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతాం అంటున్న రైతులు... ప్రభుత్వాన్ని చూసి భూములు ఇచ్చాం కాబట్టి... ఆ ప్రభుత్వమే తమను కాపాడాలని వేడుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఉత్తర్వులు తీసుకుని వచ్చి తమ జీవితాలతో చెలగాటమాడడం సబబు కాదని వాపోతున్నారు. ముఖ్యంగా 9-14 ఒప్పందాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఇవే డిమాండ్లతో సేవ్‌ అమరావతి అంటూ రైతులు మొదలుపెట్టిన ఉద్యమానికి అప్పుడే ఏడాది గడిచి పోయింది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, తమ ప్రయోజనాలు కాపాలని ఏపీ ప్రభుత్వానికి నివేదిస్తూ వినూత్నరీతుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇకపై వారి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.

ఏడాదిగా అలుపెరగని పోరాటం....అమరావతే నినాదం

ఇవీచూడండి: 'అంతర్జాతీయ రాజధాని కడతామని అన్నం లేకుండా చేశారు'

ABOUT THE AUTHOR

...view details