'అమరావతి అభివృద్ధికి సాయపడండి'.. కేంద్రానికి రైతుల విజ్ఞప్తి - Amaravati Farmers news
Amaravati Farmers in Delhi : ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత బిల్డ్ అమరావతి నినాదాన్ని అందుకున్న ఆ రాష్ట్ర రాజధాని రైతులు.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే దిల్లీ బాట పట్టారు. రెండ్రోజులుగా హస్తినలో పలువురు కేంద్రమంత్రులను కలిసి అమరావతిలో ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమైన కేంద్ర రంగ సంస్థల కార్యాలయాలు త్వరగా పూర్తిచేసేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు రైతులు తెలిపారు.
Amaravati Farmers in Delhi
By
Published : Apr 6, 2022, 9:12 AM IST
అమరావతి అభివృద్ధికి సాయపడండి
Amaravati Farmers in Delhi : అమరావతి రైతులు దిల్లీలో పర్యటిస్తున్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజధాని నిర్మాణం దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో ప్రారంభమై నిలిచిపోయిన... వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల పురోగతిపై ఆయా శాఖల మంత్రులతో చర్చించారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నారాయణ్ రాణే, నరేంద్ర సింగ్ తోమర్, అశ్వనీ వైష్ణవ్‌ను కలిసి నిర్మాణాలకు నిధుల కేటాయింపులపై వినతులు అందించారు.
Amaravati Farmers Meet Union Ministers : అమరావతిలో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థను త్వరగా ఏర్పాటు చేయాలని నారాయణ్ రాణేను కోరారు. ఇప్పటికే శాఖమూరు పరిధిలో 5 ఎకరాల భూమి కేటాయించగా కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 20 లక్షల 45 వేలు చెల్లించిందని గుర్తుచేశారు. దీనిపై నారాయణ్ రాణే సానుకూలంగా స్పందించారని.. వచ్చే నెలలో తప్పనిసరిగా శంకుస్థాపన చేస్తామని నిర్దిష్ట హామీ ఇచ్చారని రాజధాని రైతులు తెలిపారు.
Amaravati Farmers News : ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూసమావేశం అయ్యారు. ఆర్థిక శాఖకు సంబంధించి 17 నుంచి 20సంస్థల భవనాలు నిర్మించాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌కు రైతులు విన్నవించారు. ఆయా భవనాలపై అధ్యయనం చేసి.. అన్ని విభాగాలకు లేఖలు రాస్తానని నిర్మల వారికి చెప్పారు. రైల్వే, టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసి మంగళగిరి రైల్వే స్టేషన్‌తో పాటు, కృష్ణాకెనాల్ జంక్షన్‌ను ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుగా అభివృద్ధిగా చేయాలని కోరినట్లు తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరితో కలిసి ఎన్సీపీ అధినేత పవార్‌ను కలిసిన రైతులు.. ఆయనకు వినతిపత్రం అందించారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు ప్రారంభం చేస్తామనడం శుభపరిణామమన్న ఐకాస నేత సుధాకర్.. ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదం చేస్తుందన్నారు. ఇవాళ కూడా కేంద్రమంత్రులను కలుస్తామన్న రైతులు.. అపాయింట్‌మెంట్ దొరికితే హోంమంత్రి అమిత్‌షాను కలిసి అమరావతి అభివృద్ధికి చేయూత అందించాలని కోరతామని చెప్పారు.
చిన్న రాష్ట్రానికి 3 రాజధానులా?: మహారాష్ట్రలోనూ రెండు రాజధానులున్నాయని, వాటిలో ఒకటి విదర్భలో ఉన్నా ఆ ప్రాంతం ఏమీ అభివృద్ధి చెందలేదని.. అలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర కంటే చిన్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులేమిటని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన్ను కలిసిన రైతు ప్రతిధి బృందం ఈ విషయం పేర్కొంది. మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో ఈ బృందం శరద్‌పవార్‌ను కలిసి తమ సమస్యను ఏకరువుపెట్టినప్పుడు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సుమారు అరగంటకు పైగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తావిస్తూ.. ఈ అంశంపై అనేక వార్తలు వస్తున్నాయని.. ఉన్న రాజధానిలోనే పనులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
తాము హైకోర్టుకు వెళ్లామని.. కోర్టు సైతం అమరావతే రాజధాని అని, సీఆర్డీఏ ప్రకారం రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలని తీర్పు ఇచ్చిందని వారు శరద్‌పవార్‌కు వివరించారు. హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి స్పందన ఏమిటని అడగ్గా.. సీఎం పట్టించుకోవడం లేదని చెప్పారు. దానికి ఆయన.. తీర్పును పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. రాజధానిపై భాజపా వైఖరి గురించి అడిగినప్పుడు ఆ పార్టీ నాయకులు అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం సరైన మద్దతు లభించడం లేదని రైతులు ఆయనతో అన్నారు. పార్లమెంట్‌లో అమరావతికి తమ పార్టీ తరఫున మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు.