Amaravati Farmers Maha Padayatra: ఏపీలోని అమరావతి రైతుల మహాపాదయాత్ర గమ్యం చేరింది. 44 రోజులుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ.. అమరావతి నుంచి తిరుపతి చేరారు. ఒకటిన్నర నెలకిందట యాత్రకు బయల్దేరిన నాటి నుంచి .. అడుగడుగునా అడ్డుంకులు ఎదురయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఆంక్షలు, కేసులు కూడా నమోదు చేశారు! వీటన్నింటినీ ఎదురొడ్డుతూనే ముందుకు సాగారు రైతన్నలు.
తొలిరోజు అమరావతి నుంచి బయల్దేరిన రైతులు.. ఆ తర్వాత గుంటూరు జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు దాటారు. చిత్తూరు జిల్లాలోనూ అంతటి అపూర్వ స్వాగతం దక్కదేమోనని రైతులు సందేహిస్తే... అక్కడా పూలబాటే పరిచారు స్థానికులు. అనుకున్నట్లే.. శ్రీవారి పాదాల చెంతకు చేరారు. తిరుపతి నగరంలోనే 9 కి.మీ పాటు యాత్ర కొనసాగింది. దాదాపు 450కి.మీ మేర కాలినడకన వచ్చిన కర్షకులు.. చివరిగా కొబ్బరికాయలు కొట్టి తమ యాత్రను ముగించారు. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న తమకు.. వివిధ జిల్లాల్లోని ప్రజలు సంఘీభావం తెలపటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.