తెలంగాణ

telangana

250వ రోజుకు చేరిన అమరావతి మహా ఉద్యమం

By

Published : Aug 23, 2020, 5:27 PM IST

ఆంక్షలు భరించారు. లాఠీల దెబ్బలు తిన్నారు. కోర్టుల చుట్టూ తిరిగారు. పట్టు విడవకుండా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఒకటీ, రెండు కాదు... ఏకంగా 250 రోజుల పాటు పిల్లాపెద్దా ఉద్యమం చేస్తున్నారు. నమ్మి భూములిచ్చినందుకు రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమకు న్యాయం చేయాలంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకతను చాటిన రాజధాని అమరావతి ఉద్యమం నేటితో 250 రోజులు చేరుకుంటున్న సందర్భంగా... రైతులు, మహిళల నిరసనోద్యమాన్ని ఓసారి అవలోకనం చేసుకోవాల్సిన తరుణమిది.

250కు చేరిన అమరావతి మహా ఉద్యమం
250కు చేరిన అమరావతి మహా ఉద్యమం

ఏకధాటిగా మహాపోరాటం...

మొక్కవోని దీక్షతో ఏపీలోని అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటం 250 రోజులకు చేరింది. న్యాయ స్థానాల్లో పోరాటం చేస్తూనే క్షేత్రస్థాయిలోనూ అలుపెరుగకుండా రైతులు, మహిళలు ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. 3 రాజధానుల ప్రకటనతో రహదారులపైకి వచ్చిన పిల్లాపెద్దా... ఎక్కడికక్కడ శిబిరాలు వేసుకొని ఏకధాటిగా 96 రోజుల పాటు ఉద్యమం సాగించారు.

పట్టువిడవకుండా...

బైక్‌లు, ఎడ్లబళ్ల ర్యాలీలు, మహా పాదయాత్రలు, అసెంబ్లీ ముట్టడి లాంటి నిరసన కార్యక్రమాలతో పట్టు విడవకుండా పోరాటం చేశారు. తర్వాత కరోనా కమ్మేసినా ఇళ్లలోనూ నిరసన కొనసాగించారు.

రణభేరిగా మారిన రాజధాని...

రాజధాని ఉద్యమం 250 రోజుల మైలురాయిని చేరుకున్న వేళ... రాజధాని రణభేరి పేరిట ప్రత్యేక నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వానికి గళం వినిపించేందుకు రైతులు సిద్ధమయ్యారు. అన్ని దీక్షా శిబిరాలలో డ్రమ్స్, పళ్ళాలు, గరిటెలు మోగించి రణభేరికి శ్రీకారం చుట్టనున్నారు. "ఆలకించు ఆంధ్రుడా.. అమరావతి అన్నదాత ఆక్రందన" అంటూ ప్రత్యేక రూపకం ప్రదర్శించనున్నారు.

దగాపడ్డ దళిత బిడ్డ...

దళిత ఐకాస ఆధ్వర్యంలో "దగాపడ్డ దళిత బిడ్డ" కార్యక్రమం నిర్వహించనున్నారు. 5 కోట్ల ఆంధ్రుల నుంచి ఉద్యమ సహకారాన్ని ఆర్థిస్తూ కొంగు చాచి భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. "రాజధాని ప్రజల బతుకు జట్కాబండి" రూపకం ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు జూమ్ వెబినార్ ద్వారా రాజధాని మహిళలతో మాట్లాడనున్నారు.

ఇవీ చూడండి : 'రాష్ట్రంలో సాధారణ ఖైదీలను విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details