తెలంగాణ

telangana

ETV Bharat / city

covid effect: రాజధాని రైతుల అప్పులు... తిప్పలు - కొవిడ్‌ దెబ్బకు రాజధాని రైతుల విలవిల

రాజధాని అమరావతిలోని దొండపాడు గ్రామానికి చెందిన గిరిజ, ఆమె తల్లి, కుమారుడు కరోనా బారినపడ్డారు. గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ముగ్గురూ చికిత్స పొందారు. రూ.10 లక్షలు ఖర్చయ్యాయి. ఈ కుటుంబం రాజధాని నిర్మాణానికి భూసమీకరణలో ప్రభుత్వానికి ఐదెకరాలను ఇచ్చింది. ఏటా ప్రభుత్వం ఇచ్చే కౌలే వారికి ఆధారం. ప్రస్తుతం ఆస్పత్రి ఫీజులు కట్టడానికి బంధువుల వద్ద అప్పు చేశారు. ‘దేవుడు మేలు చేయబట్టి సమయానికి బంధువుల వద్ద అప్పు దొరికింది. కొవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలనుంచి మేం ఇంకా కోలుకోలేదు. అనారోగ్యంకంటే అప్పు ఎలా తీర్చాలన్న బెంగే భయపెడుతోంది’ అని గిరిజ వాపోయారు.

capital farmers debts
capital farmers debts

By

Published : Jun 10, 2021, 6:27 AM IST

ఇది ఒక్క గిరిజ సమస్యే కాదు.. రాజధాని అమరావతి పరిధిలోని చాలా గ్రామాల్లో రైతులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. రాజధాని గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు కరోనా బారిన పడిన కుటుంబాలూ ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారికి రూ.లక్షల్లో ఖర్చయింది. వారి భూమి ఏళ్ల కిందటే ప్రభుత్వానికి ఇచ్చేశారు. వ్యవసాయం లేదు. ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్లు అభివృద్ధి చేయలేదు. వాటిని అమ్ముదామన్నా కొనేవారు లేరు. ఈ పరిస్థితుల్లో చాలా మంది తెలిసినవాళ్లు, బంధువుల వద్ద అప్పు చేశారు. కొందరు ఇంట్లో ఉన్న నగానట్రా కుదువబెట్టారు.

కొవిడ్‌ మహమ్మారితో అమరావతి రాజధాని రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చేతిలో పొలం లేక ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు కొనేవారులేక వైద్యఖర్చులకు సతమతమవుతున్నారు.

  • వెంకటపాలెం గ్రామానికి చెందిన పల్లెపోగు విజయ్‌ కేఎల్‌ వర్సిటీ అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆయన కుటుంబానికి 80 సెంట్ల ఎస్సైన్డ్‌ భూమి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సైన్డ్‌ భూములకు వార్షిక కౌలు పెండింగ్‌లో పెట్టింది. విజయ్‌కు వచ్చే జీతమే ఆ కుటుంబానికి ఆధారం. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. మొదట గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో, ఆ తరువాత విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో కలిపి 21 రోజులు చికిత్స పొందారు. రూ.30 లక్షలు ఖర్చయింది. విజయ్‌ను ఎలాగైనా కాపాడాలని కుటుంబీకులు తెలిసిన వారివద్ద తలా రెండు లక్షలు అప్పు చేశారు. అయినా ప్రాణాలు దక్కలేదు. ‘విజయ్‌కు మా చెల్లినిచ్చి పెళ్లి చేశాం. ఆయనకు అమ్మానాన్నా లేరు. ఇప్పుడు మా బావ చనిపోయారు. రూ.30 లక్షల అప్పు మిగిలింది. మా చెల్లి భవిష్యత్తేంటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటు అమ్ముదామన్నా కొనేవారు లేరు. నాకున్న మూడెకరాల ఎస్సైన్డ్‌ భూమిని భూసమీకరణలో ఇచ్చా. నాకూ కరోనా వచ్చి రూ.3 లక్షలు ఖర్చయింది. విజయవాడలో ఒకరి వద్ద అప్పు చేశా. కరోనా తగ్గింది కదా.. అప్పు తీర్చమని ఒత్తిడి తెస్తున్నారు. పొలం మా చేతిలో ఉన్నప్పుడు ఎక్కడోచోట అప్పు పుట్టేది. ఇప్పుడు ఎవరినడిగినా ఎలా తీరుస్తావంటున్నారు? పిల్లలకు బడి ఫీజులూ కట్టలేకపోతున్నాం’ అని ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మరియదాస్‌ (చిన్నా) ఆవేదన వ్యక్తం చేశారు.
  • తుళ్లూరుకు చెందిన దొడ్డా వేణు(49) మూడెకరాల పొలాన్ని భూసమీకరణలో ఇచ్చారు. ఆయనకు గత నెలలో కరోనా సోకింది. గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో రూ.13 లక్షలు ఖర్చయ్యాయి. ‘ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డు పనిచేయలేదు. దొరికిన చోటల్లా అప్పు చేశాం. ఆయన పూర్తిగా కోలుకోలేదు. అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు’ అని వేణు భార్య వాణి వాపోయారు.
    * తుళ్లూరుకు చెందిన ఒక రైతు భార్యకు మొదట కరోనా సోకింది. ఆమెను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. 2.3 రోజులకు ఆయనకూ కరోనా సోకి అదే ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వ్యాధి ముదరడంతో గుంటూరులోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దంపతుల వైద్యానికి రూ.6.50 లక్షలు ఖర్చయింది. ఆ రైతు భూసమీకరణలో నాలుగెకరాలను ఇచ్చారు. భూమి కౌలే కుటుంబానికి ఆధారం. ఆస్పత్రి ఛార్జీలు కట్టడానికి బంధువుల వద్ద వారు అప్పు చేశారు.
  • ఐనవోలుకు చెందిన శ్రీనివాసరావుకు ఎకరం భూమి ఉంది. రాజధాని ప్రకటనకు ముందు తనకున్న ఎకరంతోపాటు మరో ఏడెనిమిది ఎకరాలను కౌలుకు తీసుకునేవారు. రాజధాని కోసం భూసమీకరణలో తనకున్న ఎకరం భూమినీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ఎకరంపై వచ్చే కౌలే ఆధారం. ఆయనకు ఇటీవల కరోనా సోకింది. గుంటూరు జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో 22 రోజులున్నారు. రూ.8 లక్షల ఖర్చయింది. వైద్యం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నారు.
  • తుళ్లూరుకు చెందిన వెంకట్రావు భూసమీకరణలో ఎనిమిదెకరాలను ఇచ్చారు. ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా చికిత్సకు రూ.4 లక్షలు ఖర్చయింది. ‘రాజధాని వస్తుందంటే భూములిచ్చాం. ఇప్పుడు సకాలంలో కౌలు కూడా ఇవ్వడం లేదు. నిరుడు ఆగస్టులో ఇచ్చారు’ అని ఆయన వాపోయారు.

    హెల్త్‌కార్డులు ఉపయోగపడటం లేదు: రైతులు
    రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీనిచ్చింది. హెల్త్‌కార్డులనూ ఇచ్చింది. ఆ హామీలేవీ అమలవడం లేదని, హెల్త్‌కార్డులు పనిచేయడం లేదని రైతులు చెబుతున్నారు. గతంలో తన భార్య అనారోగ్యానికి గురైతే రూ.లక్షన్నర వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని, అప్పట్లో హెల్త్‌కార్డుతో ఉచితంగానే వైద్యం లభించిందని.. ఇప్పుడు కరోనా సోకితే అప్పు చేసి చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని రైతు మరియదాస్‌ తెలిపారు.

    కౌలు ఇస్తే మేలు
    రాజధాని రాకముందు ఇక్కడి రైతులు తమ అవసరాలకు బ్యాంకులనుంచి పంట రుణాలు తీసుకునేవారు. ఇప్పుడు భూమి వారి చేతిలో లేకపోవడంతో ఈ అవకాశం లేదు. పోనీ ప్రభుత్వం తమకు కేటాయించిన ఫ్లాట్లపైనైనా రుణాలివ్వాలని రైతులు కోరుతుంటే బ్యాంకులు నిరాకరిస్తున్నాయని రైతు నాయకుడు మాదల రాజేంద్ర తెలిపారు. 2015నుంచి ప్రభుత్వం ఏటా మే నెలలో రైతుల ఖాతాల్లో కౌలు జమ చేసేది. 2019లో ఎన్నికల వల్ల జాప్యమైంది. గతేడాది ఆగస్టులో కౌలు చెల్లించారు. ఈ ఏడాది రైతులకు సుమారు రూ.196 కోట్ల వరకు కౌలు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం తమకు వెంటనే కౌలు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

భూమీ లేక... సాగూ లేక

రాజధాని నిర్మాణానికి సుమారు 29,800 మంది రైతులు 34 వేల ఎకరాలకుపైగా భూసమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చారు. వారిలో ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది ఉన్నారు. ఎకరం నుంచి ఐదెకరాల వరకున్న వారు మరో 8,500 మంది ఉన్నారు. ప్రభుత్వం మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, జరీబు భూమి ఎకరాకు రూ.50 వేల చొప్పున కౌలు నిర్ణయించింది. ఏటా పది శాతం పెంచుతోంది. సాగు కోసం చేసిన అప్పులున్నా భూమి చేతిలో ఉందన్న భరోసాతో జీవించేవారు. ఇప్పుడు సాగు చేద్దామంటే భూమి లేదు. ప్రభుత్వం భూమి తీసుకొని ఏడేళ్లవుతోంది. మూడేళ్లలో ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. వాటిని అభివృద్ధి చేయకపోయినా, ప్రభుత్వం తమకు కేటాయించిన ఫ్లాట్‌ను ఎవరికైనా ఎంతో కొంతకు అమ్ముదామంటే 3రాజధానుల ప్రకటన తర్వాత కొనేవాళ్లు లేరు.

ఇదీ చదవండి:వరి కనీస మద్దతు ధర పెంపు

ABOUT THE AUTHOR

...view details