ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు తమ పోరాట పంథా(Amaravathi maha Padayatra)లో మరో అడుగువేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు నిర్ణయాలకు వ్యతిరేకంగా 685 రోజులు... వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు, మహిళలు మహా పాదయాత్ర ద్వారా తమ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు తలపెట్టిన మహా పాదయాత్రను తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి ఈ ఉదయం 9గంటల 5 నిమిషాలకు ప్రారంభించారు.
సర్వమత ప్రార్థనలు...
అంతకుముందు మహా పాదయాత్ర విజయవంతంగా సాగాలని తుళ్లూరు దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కొనసాగాలని ప్రార్ధించారు. మహా పాదయాత్రకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఇది 29 గ్రామాల సమస్య కాదని.. 5కోట్ల ప్రజల జీవితాలు, రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యగా మహిళలు తెలిపారు. 13 జిల్లాల ప్రజలు తమ పోరాటానికి సంఘీభావం తెలిపుతున్నారని ఇందుకు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు.