నిజానికి.. మీ ప్రాంతంలో రాజధాని కడతాం. భూములివ్వండి అని ప్రభుత్వం అడిగిన వెంటనే వీళ్లంతా ఎగిరి గంతేయలేదు. నేల తల్లితో అనుబంధం పెనవేసుకున్న అందరు రైతుల్లానే వారూ ఆలోచించారు. బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోనని దిగులు పడ్డారు. వచ్చిన అధికారుల్ని.. ‘మా భూములు మీకెందుకివ్వాలి’ అని నిలదీశారు. ఊరూరా సమావేశాలు పెట్టుకున్నారు. సమాలోచనలు చేశారు. భూములిచ్చేందుకు ససేమిరా అన్నారు.
అలాంటి పరిస్థితుల నుంచి వారికి ప్రభుత్వం నచ్చజెప్పింది. రాష్ట్రానికి, భావితరాల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే రాజధాని నిర్మాణం అని వివరించింది. మీరూ, మేమూ కలసి అంతర్జాతీయ స్థాయి, ప్రజా రాజధాని నిర్మిద్దామని ఒప్పించింది. వినూత్నమైన భూసమీకరణ విధానం ప్రకటించింది. మీ పిల్లలకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు దొరుకుతాయని హామీ ఇచ్చింది. మంత్రులు ఊరూరూ రాజధాని ప్రయోజనాలు వివరించారు. ముఖ్యమంత్రి రైతులతో ప్రత్యేకంగా మాట్లాడి... వారి డిమాండ్లు ఆమోదించారు. ప్యాకేజీ ప్రకటించారు.
అధికారపక్షమూ.. ప్రతిపక్షాలూ.. రాజధాని అమరావతి విషయంలో నాడు ఒక్కమాటపై నిలిచాయి. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని.. అంశంపై రాజధాని నిర్మాణంపై శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రతిపక్షనేతగా జగన్ మద్దతు పలికారు. ఇంత జరిగాక... రాజధానికి అన్ని పక్షాల ఆమోదం ఉందని, భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందీ కలగదన్న ధీమా రైతులకు కలిగింది. భూములివ్వడానికి అంగీకరించారు.
ప్రభుత్వ ఆలోచనల మేరకు 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే రాజధాని నగర బృహత్ ప్రణాళికను సింగపూర్‌కు చెందిన సుర్బానా-జురాంగ్ సంస్థలు రూపొందించాయి. దాన్ని సీఆర్‌డీఏ రాజధానిలోని ఊరూరా ప్రదర్శించింది. రాజధానిని నవ నగరాలుగా నిర్మిస్తామని చెప్పింది. గ్రామసభలు నిర్వహించి ప్రజల అభ్యంతరాలు స్వీకరించింది. ఆ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసింది. తమకు చూపించిన, గ్రామసభలు ఆమోదించిన బృహత్ ప్రణాళిక ప్రకారమే రాజధాని అని నమ్మి రైతులు భూములిచ్చారు.
అంతేనా... రాజధాని నగరానికి సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పరిపాలన నగర నిర్మాణానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని ఆయనా హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులు, ప్రజల్లో ఇది మరింత భరోసా పెంచింది.