Amaravathi Padayatra: ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలంటూ 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పేరిట రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర తుది ఘట్టానికి చేరుకుంది. ఆంక్షలు, అడ్డంకులు ఛేదించుకుంటూ సాగిపోతున్న పాదయాత్ర.. తిరుపతికి చేరువవుతోంది. 17 రోజులపాటు పాదయాత్రకు నీరాజనాలు పలికిన నెల్లూరు గడ్డకు అమరావతి రైతులు, ఐకాస నేతలు భావోద్వేగ వీడ్కోలు పలికారు. రైతులు మోకాళ్లపై నిల్చుని సింహపురి వాసులకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో చిత్తూరు జిల్లా వాసులు అన్నదాతలకు జై అమరావతి అంటూ స్వాగతం పలికారు.
పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు ఈనెల 15, 16 తేదీల్లో శ్రీవారి దర్శనం కల్పించాలని అమరావతి ఐకాస ప్రతినిధులు తితిదేను అభ్యర్థించారు. దాదాపు 500 మందికి శ్రీవారి దర్శనం కల్పించాలని కోరారు. ఈనెల 17న సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని ఐకాస ప్రతినిధులు తెలిపారు. అనుమతిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని.. లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
మండుటెండను సైతం లెక్క చేయకుండా రైతులు 37వరోజూ సుదీర్ఘ ప్రయాణం సాగించారు. ఉద్యమకారులకు జగ్గరాజుపల్లె వద్ద తెలుగుదేశం నేతలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, బొజ్జల సుధీర్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్వాగతం పలికారు. భాజపా కిసాన్ మోర్చా ప్రతినిధులు మద్దతు తెలిపారు. తీవ్రమైన ఎండలో ఎక్కువ దూరం నడిచిన బొజ్జల సుధీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ పడిపోవడంతో పాదయాత్ర వెంబడి ఉన్న అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాళహస్తిలోని ఆసుపత్రికి తరలించారు.
భోజనాలు చేసేందుకు చోటు లేకుండా స్థానిక వైకాపా నేతలు ఇబ్బందులు సృష్టించారని రైతులు వాపోయారు. ఎంపేడు వద్ద దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పైగా గ్రామంలోనికి వెళ్లి మళ్లీ బయటకు రావాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను పూర్తి చేస్తామని తేల్చిచెప్పారు. చిత్తూరు జిల్లా జగ్గరాజుపల్లిలో మొదలైన రైతుల పాదయాత్ర దాదాపు 18 కిలోమీటర్ల సాగి.. చింతలపాలెంలో ముగిసింది. రైతులు రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
ఇదీచూడండి:కేంద్రం ప్రతిపాదనపై రైతుల అభ్యంతరం- నిరసనలపై బుధవారం నిర్ణయం!