తెలంగాణలో మార్చి రెండోవారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతల్లో ఆరబెట్టిన యాసంగి ధాన్యాన్ని పచ్చి (రా రైస్) బియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వచ్చి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఉప్పుడు బియ్యంగా మారుస్తారు.
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిన వేళ.. కొనుగోలు సమస్య మొదలైంది. యాసంగి(రబీ)లో ఉత్పత్తి అయ్యే ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. వచ్చే సీజన్‌లో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కొన్నేళ్లుగా వరి సాగుకు భూములను సిద్ధం చేసుకొన్న రైతులు మరో రెండు నెలల్లో మొదలయ్యే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు(Alternatives for Rice cultivation) సాగు చేయడం సాధ్యమా? గిట్టుబాటు అవుతాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో నూనెగింజలు, పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఈ పంటలు వేయాలంటే రైతుకు ఎన్నో సమస్యలు ఉంటాయి. నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించినా సేకరించిన సందర్భాలు తక్కువే. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలంటే ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా ఓ ప్రణాళిక ప్రకారం కొన్ని సంవత్సరాల్లో జరగాలి తప్ప వచ్చే యాసంగిలోనే అంటే అంత సులభం కాదంటున్నారు. ఈ రంగంపై విస్తృత అనుభవం ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రవీణ్‌రావు, సుస్థిర వ్యవసాయ కేంద్రం(సీఎస్‌ఏ) డైరెక్టర్ జి.వి.రామాంజనేయులు ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో ‘వరితో సమస్యలు - ప్రత్యామ్నాయ పంటల’పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
- వరిసాగు తగ్గించాలని ప్రభుత్వం చెబుతోంది. రైతుకు లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయం ఏముంది?
ప్రవీణ్‌రావు:పంట మార్పిడి తప్పనిసరిగా జరగాలి. తెలంగాణ రైతులు యాసంగిలో వేరుసెనగ, శెనగ, పెసలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఆవాలు, మినుములు, పొద్దుతిరుగుడు, ఇతర లాభదాయక పంటలవైపు మొగ్గుచూపాలి. ఇలాంటి మార్పు జరగకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో భూసార పరీక్షలు చేయించగా.. భాస్వరం, పొటాషియం ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. నత్రజని ఎక్కువ వాడుతున్నట్లు తెలిసింది. ఎరువుల వాడకంలో మార్పుల అవసరాన్ని ఈ నివేదిక తేల్చింది. రసాయన ఎరువుల వినియోగం ఇటీవల వరకు పంజాబ్‌లో ఎక్కువగా (హెక్టారుకు 217 కిలోలు) ఉండేది. దీంతో అక్కడ నేల నాణ్యత కోల్పోవడం, లవణీయత, మురుగునీటి సమస్య పెరిగాయి. ఇప్పుడు తెలంగాణ పంజాబ్‌ను అధిగమించింది. ఇక్కడ హెక్టార్‌కు 232 కిలోలు వినియోగిస్తున్నారు. అంటే దేశంలోనే ఎక్కువ. పైన సూచించిన ప్రత్యామ్నాయ పంటల వల్ల సాగు ఖర్చు తగ్గుతుంది. ఎరువుల వినియోగం కూడా తగ్గి నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. రైతుకు లాభం జరుగుతుంది. ఒక ఎకరా వరి పండించే నీటితో రెండు మూడు ఎకరాల్లో ఆరుతడి పంటలు పండించొచ్చు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే ప్రత్యామ్నాయ పంటలను సూచిస్తున్నాం.
- వరిసాగు చేసే రైతుకు భరోసా ఉంది. మిగిలిన పంటల విషయంలో అలా లేదు కదా?
రైతులకు అవగాహన కల్పించడం ప్రారంభిస్తే కొంత మార్పు వస్తుంది. మొక్కజొన్న కొనుగోలు చేయబోమని ప్రభుత్వం చెప్పిన తర్వాత విస్తీర్ణం తగ్గింది కదా. అయితే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ విధానాల్లో మార్పు రావాలి. ఆహార భద్రత ఇప్పుడు మనకు ప్రధానాంశం కాదు. దీనిని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఇతర పంటలు సాగు చేస్తే విత్తనం ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? మినుము, పెసర, పొద్దుతిరుగుడు, శెనగ పంటలను ఏయే జిల్లాల్లో ఎంత విస్తీర్ణంలో సాగు చేయవచ్చు? అనేవి ఆలోచించాలి. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో శెనగ సాగు విస్తీర్ణం పెరిగింది. దీనికి అనుగుణంగా మార్కెట్ అనుసంధానం జరిగింది. వ్యవసాయ రంగంలో 40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నా.. పండించే పంట ఏది అన్నది రైతుకు ముఖ్యం కాదు. సాగు ఖర్చు, రిస్కు తక్కువగా ఉండాలి. ఆదాయం రావాలి. వరి నుంచి ప్రత్యామ్నాయం వైపు మళ్లడం రైతుకు అంత సులభం కాదు, కానీ వీలవుతుంది. చాలా చోట్ల ఇలాంటివి జరిగాయి.
- ప్రత్యామ్నాయ పంటల గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నా.. తగిన ఆదాయం లేక రైతులు ఆ దిశగా వెళ్లడంలేదు. ఇప్పుడు సాధ్యమవుతుందా?
మన దేశం వంట నూనెల దిగుమతుల కోసం ఏటా రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మన దగ్గర రైతుకు అవసరమైన ప్రోత్సాహం కల్పించి ఆ పంటలు పండిస్తే దిగుమతులు తగ్గుతాయి. పంట మార్పిడి ప్రస్తుతం తప్పనిసరి. దీనికి తగ్గట్లుగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెరగాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. దక్షిణ తెలంగాణ వేరుసెనగకు అనుకూలం. అక్కడి రైతులకు ప్రోత్సాహం కల్పించడంతోపాటు అనుబంధ పరిశ్రమలు రావాలి. పసుపు, మిరప, సోయాబీన్, ఇతర పంటలకూ ఇలాగే ఆలోచించాలి. వీటన్నింటిపై దృష్టి పెడితే కచ్చితంగా మార్పు వస్తుంది. అయితే ఇది వెంటనే కాదు. దీనికి ఓ పదేళ్ల ప్రణాళిక, తగిన కార్యాచరణ ఉండాలి.
- రబీలో వచ్చే ధాన్యం మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయి కాబట్టి.. ఉప్పుడు బియ్యంగా వినియోగం తప్ప మరో మార్గం లేదా?
వాస్తవానికి మనం పండించే ధాన్యంలో నూక అయ్యే గుణం లేదు. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటక ముందే పంట కోతలు కోసి ధాన్యం తెచ్చుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ డిసెంబరు మధ్య నుంచి ఆఖరులోగా నాట్లు పడితే పంట చేతికి రావడానికి 90 నుంచి 95 రోజులు పడుతుంది. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. మండే ఎండలో, ఎక్కువ ఉష్ణోగ్రతలో ఆరబెడతాం. వీటన్నిటి వల్ల ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు ఎక్కువగా నూకలు కావడానికి అవకాశం ఉంది. అయితే డిసెంబరులో నాట్లు వేసినప్పుడు ధాన్యం ఆరబెట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఆలోచించాలి. ఎండలో ఆరబెట్టకుండా ఈ పని చేసే యంత్రాలు వచ్చాయి. ఒకేసారి 50 టన్నులు ఆరబెట్టవచ్చు. ఇదంతా ఆషామాషీగా జరిగేది కాదు. మిషన్‌మోడ్‌లో జరగాలి. రైతుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలి. మార్కెట్ కల్పించాలి.
" రాష్ట్రంలో వానాకాలం(ఖరీఫ్)లో వరి సాగు విస్తీర్ణం ఇంకా పెరగవచ్చు. యాసంగిలో మాత్రం ప్రత్యామ్నాయ(Alternatives for Rice cultivation) పంటలవైపు రైతులు మొగ్గుచూపాలి. ధాన్యం తరహాలోనే మిగిలిన పంటలను ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే రైతుల్లో మార్పు వస్తుంది."