వైట్ టాపింగ్, వీడీసీసీ, ప్లాస్టిక్, పేవర్‌బ్లాక్, పాలిమర్ బిటుమిన్ రహదారులు, జపాన్ రోడ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే.. బల్దియా ఇంజినీర్లు గత మూడేళ్లలో సుమారు పదిరకాల రోడ్లను నగరంలో ప్రతిపాదించారు. ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. నిధులు మాత్రం వందల కోట్ల మేర ఆవిరయ్యాయి. నిధుల దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తడంతో.. పరిస్థితిని కప్పిపుచ్చేందుకు అధికారులు మరో మార్గం ఎంచుకున్నారన్న విమర్శలొస్తున్నాయి. ప్రధాన రోడ్లను ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణకు ఇచ్చి గుంతల్లేని రోడ్లను సాకారం చేస్తామన్న మార్గమే ఇదని అనుమానం రేకెత్తుతోంది. ఎందుకంటే..
కేవలం నాలుగు రోజుల వర్షాలకే అటు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించిన మార్గాలు, ఇటు బల్దియా రహదారులపై పెద్దఎత్తున గుంతలు పడ్డాయి. ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నాయి. నగరవ్యాప్తంగా 3168.59 చ.మీ విస్తీర్ణంలో 1,535 గుంతలు ఏర్పడ్డాయి.
జీహెచ్‌ఎంసీ ఏటా రోడ్లకు వందల కోట్లు ఖర్చు పెడుతోంది. గడిచిన ఏడాదిన్నరగా రూ.800 కోట్ల మేర ఖర్చు చేసినా రహదారుల పరిస్థితి మారలేదు. 2016 నుంచీ ఇదే దుస్థితి. సెప్టెంబరు, 2016 వర్షాలు భాగ్యనగరాన్ని వణికించాయి. అప్పట్లో రోడ్లు అధ్వానంగా మారాయి. ప్రజాగ్రహాన్ని తగ్గించేందుకు ఇంజినీర్లు రూ.600 కోట్ల అంచనా వ్యయంతో పీపీఎం(పిరియాడికల్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్) కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. అనంతరం ప్లాస్టిక్ రోడ్లు, 40 ఏళ్లపాటు మన్నికనిచ్చే వైట్‌టాపింగ్ రోడ్లు, జపాన్ సాంకేతికత రహదారులు, ఇతరత్రా కొత్త రకం రోడ్లు వేస్తామని మూడేళ్లపాటు ప్రజాధనాన్ని వెచ్చించారు. వాటిలో ఏ ఒక్క ప్రతిపాదనా పూర్తి కాలేదు. పైగా మంచి ఫలితాలిచ్చిన రహదారుల రకాలను అటకెక్కించారు. మన్నిక బాగుందని అనిపించిన ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణాన్ని ఆదిలోనే ఆపేశారు. మొదట నీరు నిలిచే ప్రాంతాల్లో పేవర్‌బ్లాక్‌లతో రోడ్డు వేస్తామని ప్రకటించి, కొన్ని రోజులపాటు కొనసాగించి, చివరకు సిమెంటు రోడ్లు వేయాలని నిర్ణయించారు. అదైనా పూర్తిగా చేయలేదు. ఇప్పటికీ నగరంలో పది నిమిషాల వర్షానికే వందకుపైగా ప్రాంతాల్లో నీరు నిలుస్తోంది. రోడ్లు చిధ్రమవుతున్నాయి. లోటుపాట్లను కప్పిపుచ్చుకునేందుకు ఇంజినీర్లు చివరగా ప్రైవేటు రోడ్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సర్కారు సూచించినట్లు పేర్కొని రూ.1600 కోట్ల అంచనా వ్యయంతో 709 కి.మీ. రోడ్లను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. రోడ్డు, కాలిబాటలు, మ్యాన్‌హోళ్ల మరమ్మతుల బాధ్యత ఏజెన్సీలదేనని ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించారు. అయినప్పటికీ ఎప్పటిలాగే ప్రైవేటు రోడ్లపై గుంతలు పడుతున్నాయి. ఫిర్యాదులు పరిష్కారం కావట్లేదు. ఆరోపణలొస్తున్న ఏజెన్సీలపై అధికారులు చర్యలు తీసుకోవట్లేదు.
అడుగడుగునా గుంతలు.. వరదలా ఫిర్యాదులు అడుగడుగునా గుంతలు.. వరదలా ఫిర్యాదులు ఇవీచూడండి:విశ్వనగరమని చెప్పి విషాదనగరంగా మార్చారు: రామచంద్రారావు