జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ.3 కోట్ల 56 లక్షల 70 వేల ఆర్థిక సహాయం అందించామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఏర్పాటు చేసిన నిధి జర్నలిస్టులకు రక్షణ కవచంలా మారిందన్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన 1640 మంది జర్నలిస్టులకు 20వేల రూపాయల చొప్పున రూ.3 కోట్ల 28 లక్షలు, హోం క్వారంటైన్లో ఉన్న 87 మందికి రూ.10వేల చొప్పున 8 లక్షల 70 వేల రూపాయలను అందించామని తెలిపారు.
కీలక పాత్ర పోషించారు:
క్లిష్ట సమయంలో అత్యవసర విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బందితో సరి సమానంగా.. కొవిడ్ గురించి వాస్తవ సమాచారం ప్రజలకు అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి మూలధనం 34 కోట్ల 50 లక్షల రూపాయల నుంచి వచ్చిన వడ్డీతో మాత్రమే ఈ కార్యకలాపాలను నిర్వహించామని చెప్పారు.
ఇప్పటి వరకు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయలు.. దీర్ఝ కాలిక వ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారికి 50 వేల చొప్పున ఆర్థిక సహయం.. కరోనా విపత్తు సాయం అన్నీ కలిపి వారి కుటుంబాలకు 9 కోట్ల 50 లక్షల రూపాయలను ఖర్చు చేశామని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: 'రెడ్ అంబులెన్స్' సంస్థకు వ్యతిరేకంగా నిరసన