దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి, తెలుగు తేజం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాములపర్తి వెంకట నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. గొప్ప వ్యక్తి, విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు, భారతదేశ చిత్రపటాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిపిన పీవీ శత జయంతి వేడుకలను.. ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నరసింహారావు వందో జయంతి సందర్భంగా ఆదివారం ప్రారంభంకానున్న ఉత్సవాలు ఏడాది పొడవునా జరగనున్నాయి.
'పీవీ.. తెలంగాణ ఠీవీ..'
హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద ఆదివారం శతజయంతి వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. నరసింహారావు దేశానికి, వివిధ రంగాలకు చేసిన సేవలు.. ప్రపంచానికి చాటేలా 'పీవీ.. తెలంగాణ ఠీవీ' అన్న తరహాలో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు సీఎం. ఇందుకోసం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు అధ్యక్షతన శతజయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. పీవీ కుటుంబీకులు కూడా కమిటీలో సభ్యులుగా నియమించారు. కుటుంబ సభ్యులు, పీవీ స్నేహితులు, సన్నిహితులు, ప్రముఖులతో పాటు అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుని ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
విదేశాల్లోనూ ఉత్సవాలు..
రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పీవీ శతజయంతి వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉంటున్న విదేశాల్లోనూ ఉత్సవాలను నిర్వహించాలన్న సీఎం.. వాటిని పర్యవేక్షించి, సమన్వయం చేసే బాధ్యతను మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. 51 దేశాల్లో ఉంటున్న ప్రవాసీయులతో కేటీఆర్ ఇప్పటికే ఈ విషయమై చర్చించారు. ఇతర సంఘాలు, తెలుగువారందరితో కలిసి పీవీ శతజయంతిని నిర్వహించాలని కోరారు.