ఆర్టీసీ సమ్మెకు రాజకీయ రంగు..? ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలుస్తూ ప్రత్యక్ష పోరాటం చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ సమ్మెకు భాజపా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది.
31 బస్సు డిపోల ఎదుట భాజపా ధర్నా
ఇవాళ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 31 బస్సు డిపోల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. బస్సు భవన్ ఎదుట జరిగే ధర్నాకు లక్ష్మణ్ నేతృత్వం వహించనున్నారు. ఆర్టీసీ సమ్మె కేవలం 50 వేల కార్మికుల సమస్య మాత్రమే కాదని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబందించిందని ఉద్ఘాటించారు.
సమస్య పరిష్కారించండి
రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆర్టీసీ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని కార్మికుల సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. లేని పక్షంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదని ప్రజల సమస్యగా గుర్తించాలని కోరారు.
రాష్ట్ర బంద్‌పై అఖిల పక్షం చర్చ..?
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల పక్షం సమావేశం జరగనుంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర బంద్‌ను ప్రకటించే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వంలో చలనం వచ్చే విదంగా వివిధ రూపాల్లో కార్మికులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తామని రాజకీయ నేతలు ప్రకటించారు.
ఇవీ చూడండి: సర్కారు దిగిరాకుంటే... ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం: తమ్మినేని