ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి... కోర్టు కేసులను సాకుగా చూపిస్తూ నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కోర్టు కేసులను క్లియర్ చేసి 2017లో గురుకుల పీఈటీగా ఎంపికైన వారిని ఉద్యోగాల్లో నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో అఖిల పక్ష సమావేశంలో... ఆర్.కృష్ణయ్యతో పాటు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెజస అధ్యక్షుడు ప్రొ కోదండరాం పాల్గొన్నారు.
వారం రోజుల్లోగా ఇవ్వాలి
పోలీసుల భద్రత మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుస్తోంది. పాఠశాలలో పీఈటీల కొరత వల్ల క్రీడాకారులను తయారు చేయకపోతున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకే వారు క్రీడాల్లో రాణిస్తున్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయకపోతే... దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. పోస్టులు మొత్తం భర్తీ చేసేంత వరకు నిరుద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాలి. పీఈటీలుగా ఎంపిక అయిన 616 మందికి వారం రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వకపోతే టీఎస్పీఎస్సీని దిగ్బంధిస్తాం.