తెలంగాణ

telangana

ETV Bharat / city

అమరావతి రైతుల పాదయాత్ర, మూడు రాజధానులపై.. ఎవరేమన్నారంటే..? - ఏపీ తాజా వార్తలు

All Parties Reactions On Capital Issue: ఏపీలో మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. ఎన్ని కోర్టులకు వెళ్లినా న్యాయమే గెలుస్తుందన్నారు. ఏపీకి అమరావతే ఏకైక రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల మహా పాదయాత్రకు అడ్డుపడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో కచ్చితంగా పాదయాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు.

అమరావతి
అమరావతి

By

Published : Sep 18, 2022, 10:56 PM IST

All Parties Reactions On Capital Issue: ఆంధ్రప్రదేశ్​లో విజయసాయిరెడ్డి, ఆయన పరివారం విశాఖలో వేల కోట్ల ఆస్తులు దోచేశారని తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కంటికి కనిపించిన ఆస్తినల్లా లాక్కుంటున్నా.. ఉత్తరాంధ్రకు చెందిన ఒక్క వైకాపా నేత కూడా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని కడితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుందంటున్న నాయకులు విజయసాయి దోపిడీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల పాదయాత్రను వైకాపా ఎలా అడ్డుకుంటుందో చూస్తామన్నారు. ఎవరైనా అడ్డంకులు సృష్టించాలనుకుంటే యాత్ర ఎలా జరిపించాలో తమకు తెలుసన్నారు. ఉత్తరాంధ్రలో దేవుడి దర్శనానికి రైతులు వస్తుంటే.. వైకాపా నేతల వద్ద వీసా తీసుకోవాలా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి విశాఖను దోచేస్తుంటే మాట్లాడని మంత్రులు, ఇతర నేతలు.. రాజధాని రైతుల పట్ల రెచ్చిపోవడం దారుణమన్నారు.

"రూ.25 వేల కోట్లు ఆస్తులు తనఖా పెట్టడం వాస్తవం. విజయసాయి రూ.10 వేల కోట్ల ఆస్తులు అక్రమించుకున్నారు. వృద్ధుల కోసం వైఎస్‌ ఇచ్చిన స్థలం కూడా లాక్కున్నారు. భూములిచ్చిన రైతులను దొంగల్లా చూస్తారా? రైతులు వస్తే వారికి పాదాభివందనం చేయాలి. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రకు అండగా నిలుస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు రైతుల యాత్రను స్వాగతించాలి": -అయ్యన్నపాత్రుడు తెదేపా నేత

మీడియా సంస్థలు, వాటి అధిపతులపై శాసనసభ వేదికగా సీఎం మాట్లాడిన తీరు దారుణమని.. తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సీఎం స్థాయికి తగునా అని ప్రశ్నించారు. దోపిడీ సొమ్ముతో సాక్షి పత్రిక, టీవీ ఛానెళ్లు ఏర్పాటు చేసిన జగన్‌రెడ్డి.. కష్టార్జితంతో పైకొచ్చిన ఈనాడు గ్రూప్‌ సహా ఇతర సంస్థలపై మాట్లాడటం ఏమిటని నిలదీశారు. జగన్‌ సీఎం అయ్యాక ఆయన సొంత కులం సహా ఏ వర్గానికి మేలు జరగలేదన్నారు.

రాజధాని అమరావతి అంశాన్ని ఎన్నికల వరకు సాగదీయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్‌ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే హైకోర్టు తీర్పుపై ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారని గుర్తు చేశారు. రాష్ట్ర పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలో అమరావతికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు.

"రాజధానిపై నిర్ణయం చేసే అధికారం రాష్ట్రానికి లేదని కోర్టు చెప్పింది. ఎన్నికల వరకు వాయిదాలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుమానం. కొత్త సీజేఐకు ఏపీ వ్యవహారాలు, సీఎం జగన్ పట్ల అవగాహన ఉంది. సీజేఐ జస్టిస్‌ లలిత్ గతంలో జగన్ తరఫున కేసుల్లో లాయర్‌గా ఉన్నారు. రాజధాని విషయంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. రాజధానిపై సీజేఐ న్యాయం జరిగేలా చొరవ చూపుతారని ఆశిస్తున్నా."- పయ్యావుల కేశవ్‌ తెదేపా నేత

పార్లమెంటులో మళ్లీ చట్టం తీసుకొస్తే తప్ప.. అమరావతి నుంచి రాజధానిని తరలించే అవకాశమే లేదని భాజపా నేత సుజనా చౌదరి తేల్చిచెప్పారు. అసెంబ్లీలో ఒకసారి చట్టం చేశాక ఇకపై మాటిమాటికీ రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందన్నారు. ఓటు హక్కును ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని మంచి నాయకుడిని ఎన్నుకుంటే తప్ప రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదని సుజనా స్పష్టం చేశారు.

"భారత రాజ్యాంగం ప్రకారమే విభజన చట్టం. రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉంది. 2014లో 175 మంది ఎమ్మెల్యేలు అమరావతే రాజధానిగా తీర్మానించారు. అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా అంగీకరించాయి. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం మంచి పద్ధతి కాదు." -సుజనా చౌదరి భాజపా నేత

అమరావతి రైతుల పాదయాత్ర, మూడు రాజధానులపై.. ఎవరేమన్నారంటే..?

ఇవీ చదవండి:తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 26 మందిపై కేసు.. నలుగురు అదుపులోకి..

వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు.. సెకన్లలో అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details