తెలంగాణ

telangana

ETV Bharat / city

బల్దియా పోరు: ఇక ప్రచార పర్వం

కదనరంగంలోకి దూకేదెవరైనా.. కనీవినీ ఎరుగని వ్యూహాలు పన్నినా.. యుద్ధానికి వెళ్లాలంటే ముందు రథమెక్కాల్సిందే. గల్లీ...గల్లీ తిరగాలి. వీధులన్నీ చుట్టాలి. ఓట్లు రాలాలంటే ఇంకా చిత్రవిచిత్రాలు ప్రదర్శించాల్సిందే. ఇలాంటి వాటికి వేదికయ్యేందుకు వేగంగా ముస్తాబవుతున్నాయి...ప్రచార రథాలు. అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మోస్తూ...సమరంలోకి దూసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి..

ghmc elections
బల్దియా పోరు: ఇక ప్రచార పర్వం

By

Published : Nov 20, 2020, 8:36 PM IST

మహాపోరుకు మరో పదిరోజులే సమయం... ప్రత్యర్థులను చిత్తుచేసే ఎత్తులు ఒకవైపు... ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాలు మరోవైపు... సమయం తక్కువున్నా.. పోరులో పైచేయి సాధించాల్సిందే.

ఊహించని రీతిలో మోగిన బల్దియా నగారాతో... అదే వేగంతో ప్రజల్లోకి దూసుకువెళ్లేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఓటర్లను ఆకర్షించటం... శ్రేణుల్లో ఉత్సాహం నింపాలంటే ప్రచారాన్ని మించిన మరో అస్త్రం ఉండదు. సామాజిక మాధ్యమాలతో యువతను ఆకర్షించినా... క్షేత్రస్థాయిలో ప్రసన్నం చేసుకోవాలంటే... నేరుగా ప్రజల్లో తిరగాల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు కోసం ప్రచార డోలికలు మోగించేందుకు రథాలు సిద్ధమవుతున్నాయి.

ప్రచార రథాలు సిద్ధం..

నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగియటంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించారు. ప్రధాన పార్టీలైన తెరాస, భాజపా, కాంగ్రెస్, మజ్లీస్‌లతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు సైతం రథాలను తయారు చేయించుకుంటున్నారు. పార్టీ రంగులు, గుర్తులు, అభ్యర్థులు, నేతల చిత్రాలు ముద్రించిన ఫ్లెక్సీలతో తయారీదారులు వాటిని అందంగా అలకరిస్తున్నారు. నగరంలో పెద్ద డివిజన్లలో సగటున 50 వేల మంది ఓటర్లు, వందకుపైగా కాలనీలు ఉన్నాయి. పోలింగ్‌కు మరో పది రోజులే వ్యవధి ఉన్నందున... ఈ గడువులోనే ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడం, సుడిగాలి పర్యటనలు, రోడ్‌షోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తెరాస, కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎం నేతల ప్రచార రథాలు నగరంలో ఎక్కడికక్కడ సిద్ధమవుతున్నాయి.

ముందుగా టికెట్‌ ఖరారైన డివిజన్లలో ఇప్పటికే ముస్తాబైన ఈ వాహనాలు ప్రచారంలోకి దూకేందుకు వేచిచూస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం జరగాలంటే సామాజిక మాధ్యమాలకు తోడు... ప్రచార రథాలను ఎక్కువగా వినియోగిస్తేనే సాధ్యమవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ముఖ్యనేతలు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడళ్లలో ప్రసంగించేందుకు వీలుగా ఓపెన్‌టాప్‌ ప్రచార వాహనాలను అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పోటాపోటీగా రూపుదిద్దుకుంటున్న ఈ వాహనాలను...కొన్ని ఏజెన్సీలు, ఆటోలు, వ్యానులు, డీసీఎంలను ప్రచార రథాలుగా మారుస్తున్నాయి.

ఇవీచూడండి:ముగిసిన నామినేషన్ల సందడి.. చివరిరోజు కోలాహలం

ABOUT THE AUTHOR

...view details