తెలంగాణ

telangana

ETV Bharat / city

వేడెక్కిన మునుగోడు.. పోరుకు అన్ని పార్టీలు సమాయత్తం - మునుగోడు ఉపఎన్నికలు

Munugode bypoll: ఎన్నికల తేదీ తేలకున్నా అన్ని రాజకీయపార్టీల్లో ఉప ఎన్నికల సందడి మొదలైైంది. ఈ ఉపపోరుకు తెరాస, భాజపా, కాంగ్రెస్‌ సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమావేశాలు..సన్నాహాలు.. వ్యూహాలతో గెలుపు కార్యాచరణ చేపడున్నారు.

munugode bypoll
munugode bypoll

By

Published : Aug 11, 2022, 4:58 AM IST

Munugode bypoll: రాష్ట్రంలో రాజకీయం మునుగోడు చుట్టూ కేంద్రీకృతమైంది. అన్ని రాజకీయపార్టీల్లో ఉప ఎన్నికల కాక రగులుతోంది. పోలింగ్‌ తేదీ ఖరారు కాకున్నా.. సందడి మొదలైంది. సమావేశాలు, వ్యూహాలు, అలకలు, బుజ్జగింపులతో పార్టీల నేతలు తలమునకలయ్యారు. తెరాస, కాంగ్రెస్‌, భాజపా ముఖ్యనేతలంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల ముందు జరగనున్న అత్యంత కీలకమైన ఉపఎన్నిక కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. మునుగోడులో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ముఖాముఖి పోటీలు జరగ్గా, ఈ దఫా ముక్కోణపు పోటీ జరగనుంది.

తెరాస: అభ్యర్థి ఎంపికపై కసరత్తు:గత ఎన్నికల్లో ఓటమిపాలైనా తెరాసకు స్థానిక సంస్థలపై పట్టు ఉంది. ఈ నేపథ్యంలో 2023 శాసనసభ ఎన్నికలకంటే ముందు వచ్చిన ఉప ఎన్నికల అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఎలాగైనా ఇక్కడ గెలవాలని వ్యూహాలకు పదునుపెడుతోంది. అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం ఈ విషయమై హైదరాబాద్‌లో నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటించిన వెంటనే కాంగ్రెస్‌ మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తాజాగా బుధవారం అశావహులతో మీటింగ్‌ నిర్వహించింది.

భాజపా: సత్తా చాటే యత్నం:ఇక భాజపా ఈ ఎన్నికను ఒక అవకాశంగా తీసుకుంటోంది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరడంతో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్‌లలో విజయంతో దూకుడుమీద ఉన్న ఆ పార్టీ ఇక్కడ గెలిచి తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని చాటాలని ప్రయత్నిస్తోంది. ఆ మేరకు అంతర్గత సమావేశాలను కొనసాగిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ఈ నియోజకవర్గం పరిధిలో సాగడంతో రాజకీయాలు వేడెక్కాయి. 2014లో భాజపా-తెదేపా ఉమ్మడి అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 27434 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 12725 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌: గెలవాలనే పట్టుదల:సంస్థాగతంగా తాము బలంగా ఉన్న మునుగోడులో సిటింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి భాజపాలో చేరిన నేపథ్యంలో ఆయనను ఓడించాలని, స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే పీసీసీ, నల్గొండ జిల్లా నేతలు ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటించిన వెంటనే కాంగ్రెస్‌ మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరులో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తాజాగా బుధవారం అశావహులతో మీటింగ్‌ నిర్వహించింది.

సీపీఐ: పోటీకి సై: వామపక్షాలైన సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో అయిదు సార్లు ఇక్కడ సీపీఐ ప్రాతినిధ్యం వహించడంతో పాటు స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, క్షేత్ర స్థాయిలోని నాయకత్వం, శ్రేణుల బలంతో సత్తాచాటాలని చూస్తున్నాయి. పొత్తుల జోలికి పోకుండా విడిగానే పోటీకి ఆ పార్టీలు సుముఖత చూపుతున్నాయి.

కాంగ్రెస్‌-కమ్యూనిస్టులకు ఆదరణ:1952 నుంచి చిన్నకొండూరు నియోజకవర్గం పేరుతో ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాటి స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. 1967 నుంచి జరిగిన 12 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆరుసార్లు విజయం సాధించగా సీపీఐ అయిదు సార్లు నెగ్గింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తొలి ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది. కాంగ్రెస్‌ అగ్రనేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు గెలవగా 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. సీపీఐ ముఖ్యనేత ఉజ్జిని నారాయణరావు 1985, 1989, 1994లలో గెలవగా పల్లా వెంకట్‌రెడ్డి 2004లో, ఉజ్జిని యాదగిరిరావు 2009లో విజయం సాధించారు. ఎక్కువ సార్లు కాంగ్రెస్‌, వామపక్షాల మధ్య పోటీ సాగింది. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి రెండో స్థానంలో నిలవగా 2014లో ఆయన కుమార్తె పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. సీపీఐ అగ్రనేత బి.ధర్మభిక్షం 1983లో మునుగోడు బరిలో దిగి ఓటమి పాలయ్యారు.

ఈ నియోజకవర్గంలో బలహీనవర్గాల వారే అత్యధికంగా ఉన్నారు. మునుగోడు, చండూరు, చౌటుప్పల్‌, మర్రిగూడ, సంస్థాన్‌ నారాయణపురం, నాంపల్లితో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న గట్టుప్పల్‌ మండలాలు ఉన్నాయి. ఒక జడ్పీటీసీ స్థానం, మండల పరిషత్‌ మినహా అన్నీ తెరాస చేతిలో ఉన్నాయి.

ఇవీ చదవండి:Etela Rajender: నాపై అలాంటి వార్తలు రావడాన్ని ఖండిస్తున్నా: ఈటల

'ఎవరిని నిలబెట్టినా గెలిపించేందుకు సై..' అసంతృప్తులతో మంత్రి చర్చలు సఫలం..

ABOUT THE AUTHOR

...view details