Inter first year results: ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 16న వెల్లడించిన ఫలితాల్లో 51 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 2,35,230 మంది ఫెయిల్ కావడంతో... విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఆన్లైన్, టీవీ పాఠాలు అర్థం కాకపోవడం, సకాలంలో పరీక్షలు నిర్వహించక పోవడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు నష్టపోయారన్న విమర్శలు ఎదురయ్యారు. అందరినీ పాస్ చేయాలని లేదా గ్రేస్ మార్కులు కలిపి కొందరిని ఉత్తీర్ణుల్ని చేయాలని లేదా ప్రత్యేక సప్లిమెంటరీ నిర్వహించాలని ఇంటర్ బోర్డు సిఫార్సు చేసింది. వివిధ అంశాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైన విద్యార్థులందరి పాస్ చేయాలని నిర్ణయించింది.
పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం, ఇంటర్ బోర్డు లోపమేమీ లేదని... అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రెండో సంవత్సరం పరీక్షలపై ఒత్తిడి ఉండకూడదన్న ఉద్దేశంతో అందరినీ పాస్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 10 మార్కులు కలిపితే 8,070 మంది, 25 మార్కులు కలిపితే 70 వేల మంది ఉత్తీర్ణులవుతారన్న మంత్రి.. ఫెయిలైనవాళ్లందరికీ కనీస మార్కులు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.
"ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. నెల రోజుల సమయమిచ్చి పరీక్షలు నిర్వహించాం. 4.50 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 49శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఫలితాలపై వచ్చిన విమర్శలు సరికాదు. 10 వేల మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించారు. ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు బాధాకరం. ప్రభుత్వాన్ని నిందించడం చాలా బాధ కలిగించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల విషయంలో బోర్డు తప్పేమీలేదు. ఇంటర్ బోర్డు తప్పు లేకున్నా నిందిస్తున్నారు. ఇంటర్ పరీక్షల విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు, విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలి. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా."- సబితా ఇంద్రారెడ్డి, మంత్రి
ఆత్మహత్యలు చేసుకోవద్దు..