తెలంగాణ

telangana

ETV Bharat / city

పర్వదినం వేళ.. వెల్లి విరిసిన పూల మార్కెట్లు.. - flower markets latest news

తెలుగు రాష్ట్రాల్లో పూల మార్కెట్‌ను భారీ వర్షాలు, వరదలు కుదిపేయగా... తాజాగా బతుకమ్మ, దసరా పర్వదినం వేళ పూల మార్కెట్‌లో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పూల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వినియోగదారులు, రైతులు, వ్యాపారులతో రద్దీ నెలకొంది. బంతి, చేమంతి, గులాబీ, అలంకరణ పూల ధరలకు రెక్కలొచ్చాయి. చిల్లర వ్యాపారులు మరింత ధరలు పెంచేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షం వల్ల పంటలన్నీ దెబ్బతినగా... మిగిలిన పంటకు గిరాకీ రావడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

all flower markets crouded with customers on behalf of dussehra
పర్వదినం వేళ.. వెల్లి విరిసిన పూల మార్కెట్లు..

By

Published : Oct 24, 2020, 7:25 PM IST

బతుకమ్మ, దసరా పర్వదినం వేళ... మార్కెట్లలో రద్దీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పూల మార్కెట్లన్నీ కళకళలాడుతోన్నాయి. కోవిడ్-19 నిబంధనలను తోసిరాజని మార్కెట్లు దర్శనమిస్తున్నాయి. పూల ధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బంతి, చేమంతి, గులాబీ, మల్లె, కనకాంబరం, అరటి ఆకులు, గుమ్మడి కాయ, కొబ్బరికాయ, ఇతర పూజా సామగ్రి ధరలు మండిపడుతున్నాయి.

ధర 50 నుంచి 150కు:

కరోనా నేపథ్యంలో పండుగలు ఎవరి ఇంట్లో ఆ కుటుంబాలు, ఉత్సవాలు జరుపుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన దృష్ట్యా ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో అలంకరణలకు.. బతుకమ్మను పేర్చడం కోసం పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బంతి కిలో ధర 50 రూపాయలు పలకాల్సి ఉండగా... 100 నుంచి 150 రూపాయలు, చేమంతి కిలో ధర 200 రూపాయలు, గులాబీ ధర 300 నుంచి 400 రూపాయల చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెద్దగా సరకు రాకపోవడంతో... పక్క రాష్ట్రాల నుంచి పూలు రావడంతో ధరలు పెరిగిపోయాయి. గతేడాదితో పోల్చితే... ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు పూలు ధరలు బాగా పెరిగిపోయాయని, కరోనా విపత్తు సమయంలో రేట్లు మండిపోతుంటే పండగలు ఎలా జరుపుకోవాలో అర్థం కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

బోసిపోయినవన్నీ రద్దీతో..

ఈ ఏడాది కరోనాతో పాటు భారీ వర్షాలు, వరదలు అన్ని రకాల పంటలపై తీవ్రంగా ప్రభావం చూపాయి. ప్రత్యేకించి పూల తోటలు విపరీతంగా దెబ్బతినడంతో దిగుబడులు అమాంతం పడిపోయి రైతులు నష్టాలు చవిచూశారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలు వేళ పూలకు డిమాండ్​ ఏర్పడడంతో రైతుల్లో సంతోషం నెలకొంది. నిన్న మొన్నటి వరకు రద్దీలేక బోసిపోయిన పూల మార్కెట్లన్నీ ఈ సమయంలో కళకళలాడుతూ దర్శనమిస్తున్నాయి. నగర శివార్లలో, చిల్లర మార్కెట్‌లో ధరలు ఎక్కువగా ఉన్నాయి.

పర్యవేక్షణ లోపం :

అతిపెద్ద టోకు మార్కెట్ గుడిమల్కాపూర్​లో దళారులు, చిల్లర వర్తకుల ఇష్టారాజ్యం, మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపం వెరసి ధరలు భారీగా ఉన్నాయని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూల తోటలన్నీ వర్షం, వరద నీటి ముంపునకు గురై నష్టపోయాయి. మిగిలిన కొద్దోగొప్పో పంటను మార్కెట్‌కు తీసుకురావడానికి రోడ్లన్నీ కోతలకు గురై రవాణాకు అడ్డంకిగా మారాయి. గత్యంతరంలేక తోటల్లోనే వదిలేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అవకాశం ఉన్న సమీప ప్రాంతాల రైతులు మాత్రం మార్కెట్‌కు తీసుకొచ్చి.. పూలకు మంచి ధరలు పొందుతున్నారు.

ఇదీ చూడండి:'కేసీఆర్​ నియంతృత్వ పోకడలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details