తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి పీవీ శతజయంత్యుత్సవాలు.. ప్రారంభించనున్న కేసీఆర్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పీవీ సేవలు అందరికీ తెలిపేలా ఏడాది పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లోనూ పీవీ జయంతి వేడుకలు జరగనున్నాయి.

pv narasimha rao jayanthi
pv narasimha rao jayanthi

By

Published : Jun 28, 2020, 6:12 AM IST

దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి, తెలుగు తేజం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాములపర్తి వెంకట నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గొప్ప వ్యక్తి, విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు, భారతదేశ చిత్రపటాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిపిన పీవీ శత జయంతి వేడుకలను.. ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నరసింహారావు వందో జయంతి సందర్భంగా ఇవాళ ప్రారంభంకానున్న ఉత్సవాలు ఏడాది పొడవునా జరగనున్నాయి.

'పీవీ.. తెలంగాణ ఠీవీ..'

హైదరాబాద్ నెక్లెస్​రోడ్​లో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద శతజయంతి వేడుకలను ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. దేశానికి, వివిధ రంగాలకు పీవీ చేసిన సేవలు.. ప్రపంచానికి చాటేలా పీవీ.. తెలంగాణ ఠీవీ అన్న తరహాలో ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు సీఎం. ఇందుకోసం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు అధ్యక్షతన శతజయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. పీవీ కుటుంబీకులు కూడా కమిటీలో సభ్యులుగా నియమించారు. కుటుంబ సభ్యులు, పీవీ స్నేహితులు, సన్నిహితులు, ప్రముఖులతో పాటు అందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుని ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

విదేశాల్లోనూ ఉత్సవాలు..

రాష్ట్రంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ పీవీ శతజయంతి వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉంటున్న విదేశాల్లోనూ ఉత్సవాలను నిర్వహించాలన్న సీఎం.. వాటిని పర్యవేక్షించి, సమన్వయం చేసే బాధ్యతను మంత్రి కేటీఆర్​కు అప్పగించారు. 51 దేశాల్లో ఉంటున్న ప్రవాసీయులతో కేటీఆర్ ఇప్పటికే ఈ విషయమై చర్చించారు. ఇతర సంఘాలు, తెలుగువారందరితో కలిసి పీవీ శతజయంతిని నిర్వహించాలని కోరారు.

తెలిసింది కొంతే... తెలియాల్సింది చాలా..

శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పీవీ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పీవీ వ్యక్తిత్వం గురించి ప్రస్తుత తరానికి తెలియాల్సిన అవసరం ఉందని, శతజయంతి ఉత్సవాలు ఇందుకు మంచి వేదికవుతాయని వారు అభిప్రాయపడ్డారు. పీవీ గురించి తెలిసింది కొంతే... తెలియాల్సింది చాలా ఉందని వారు అభిప్రాయపడ్డారు.

సేవలను స్మరించుకునేలా..

బహుభాషాకోవిదుడైన పీవీ నరసింహారావు గొప్ప సాహితీవేత్త. వివిధ భాషల్లో ఎన్నో రచనలు చేశారు. భాషా, విద్యారంగాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. పీవీ సేవలను స్మరించుకునేలా పుస్తకాల ముద్రణ, డాక్యుమెంటరీ, సెమినార్లు, సదస్సులు, వివిధ కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించనున్నారు. శతజయంతి ఉత్సవాల కోసం పీవీ జ్ఞానభూమిని అధికారులు ముస్తాబు చేశారు. నగరంలో హోర్డింగులు ఏర్పాటు చేశారు.

భారతరత్నం

పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభలో తీర్మానం చేయించి.. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి విన్నవిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంటులో పీవీ చిత్రం ఏర్పాటు చేయాలని కోరనున్నారు. శాసనసభలో ఆయన చిత్రం ఏర్పాటుతో పాటు హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగర, దిల్లీలోని తెలంగాణభవన్‌లో కాంస్య విగ్రహాల ఏర్పాటు చేస్తామని, పీవీ పేరిట స్మారక పురస్కారాలిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు.

రామేశ్వరం వెళ్లనున్న కమిటీ

పర్యాటక కేంద్రాలుగా ఆయన పుట్టిన ఊరు లక్నెపల్లి, సొంత ఊరు వంగరను అభివృద్ధి చేస్తారు. శతజయంత్యుత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్మారకం మాదిరే హైదరాబాద్‌లో పీవీ స్మారక ఏర్పాటు కోసం కేకే నేతృత్వంలోని కమిటీ సభ్యులు రామేశ్వరం వెళ్లి రానున్నారు. పీవీపై ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుంది. ఆయన జీవిత విశేషాలతో సావనీర్లు ముద్రిస్తారు. దిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో పీవీ హోర్డింగులు ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చదవండి:రాజకీయం- సాహిత్యం రెండు కళ్లలా 'పీవీ' జీవనం

ABOUT THE AUTHOR

...view details