TDP MLCs on AP Government : మద్య నిషేధంపై చర్చకు ఏపీ ప్రభుత్వం భయపడుతోందని ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్సీలు వరుసగా ఐదోరోజూ శాసనమండలిలో నిరసన తెలిపారు. ఐదు రోజులుగా చర్చకు అనుమతించాలని కోరుతున్నా ఛైర్మన్ పట్టించుకోవడం లేదంటూ పోడియం మెట్లపై బైఠాయించారు. ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఛైర్మన్ మోషేనురాజు సభను 3 సార్లు వాయిదా వేశారు. మండలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభం కాగానే.. తెదేపా ఎమ్మెల్సీలు పోడియం దగ్గరకు రాకుండా.. ఇరువైపులా మార్షల్స్‌ను రక్షణగా ఉంచారు. దీనిపై పీడీఎఫ్, భాజపా ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్మన్ ఆదేశం లేకుండా మార్షల్స్ సభలోకి ఎలా వచ్చారని అందరూ అడగడంతో మార్షల్స్‌ను బయటకు పంపేశారు.
TDP MLCs About Liquor Ban : అనంతరం సభ ప్రారంభం కాగానే మద్య నిషేధంపై చర్చకు అనుమతించాలంటూ తెదేపా సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఛైర్మన్ తిరస్కరించారు. కొద్దిసేపు వారి స్థానాల్లోనే ఉండి తెదేపా సభ్యులు నిరసన తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆ తర్వాత కొందరు వెల్‌లోకి వెళ్లగా.. మిగిలిన వారు పోడియాన్ని చుట్టుముట్టారు. తెదేపా సభ్యుల నిరసనల నడుమ ప్రశ్నోత్తరాలను ఛైర్మన్ కొనసాగించారు. తెదేపా సభ్యుల నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో 10.39కి సమావేశాన్ని ఛైర్మన్ వాయిదా వేశారు. అనంతరం 11.38కి తిరిగి ప్రారంభించాక మిగిలిన అన్ని ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానం చెప్పినట్లుగా భావించాలని ఛైర్మన్ ప్రకటించారు.
TDP MLCs About Alcohol Ban : తెదేపా సభ్యుల నిరసనల నడుమ లఘు ప్రశ్నలపై చర్చను ఛైర్మన్ ప్రారంభించారు. పెగాసస్‌పై చర్చకు అనుమతించాలని వైకాపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ షార్ట్ నోటీసు ఇచ్చారు. ఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించేలా తెదేపా ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి సూచనలు తీసుకుని అవసరమైతే సభ నిబంధనలను మార్చాలని ప్రతిపాదించారు. సమావేశానికి అంతరాయం కలిగిస్తున్న సభ్యులను శాసనసభలో అమలు చేస్తున్న మాదిరిగా సస్పెండు చేసే అంశాన్ని మండలిలోనూ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలనే ప్రతిపాదనను ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.