Alai Balai ceremony to begin at Nampally Exhibition Ground: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం వేదికగా నేడు నిర్వహించే అలయ్ బలయ్ వేడుకలు జరుగుతున్నాయి. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా జరగుతున్న అలయ్ బలయ్‌కు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ, కేరళ గవర్నర్లు డాక్టర్ తమిళసై సౌందర రాజన్, విశ్వభూషణ్ హరిచందన్, ఆరిఫ్ ఖాన్ పాల్గొనున్నారు. అలాగే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ఖట్టర్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, భగవంత్ ఖుభా హాజరయ్యారు. సినీ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇప్పుడిప్పుడే పలువురు ప్రముఖులు తరలి వస్తున్నారు. వచ్చిన అతిథులను బండారు విజయలక్ష్మి రిసీవ్ చేసుకుంటున్నారు.
17 ఏళ్ల నుంచి సాగుతున్న పయనం..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 17ఏళ్ల కిందట అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా భాగ్యనగరంలో నిర్వహిస్తూ వస్తున్నారు. శతృత్వాన్ని తొలగించి.. స్నేహభావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఒక్క వేదికపై తీసుకువచ్చి శుభాకాంక్షలు తెలుపుకునే మహత్తర కార్యక్రమం.