సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీతో దేశానికే ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా 27న నిజామాబాద్‌లో సభ నిర్వహించనున్నట్లు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆ సభకు తెరాసను ఆహ్వానించామని చెప్పారు. మిగతా పార్టీలను కూడా పిలవాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలను కూడా ఆహ్వానిస్తామని అన్నారు.
కేరళ తరహాలో...
"కేరళ తరహాలో రాష్ట్రంలోనూ ఎన్‌పీఆర్‌ని చేపట్టవద్దని కేసీఆర్ను కోరాం. రెండు రోజుల్లో వైఖరి చెబుతామని సీఎం చెప్పారు. ఇది కేవలం ముస్లింల సమస్య మాత్రమే కాదని, దేశ సమస్య అని సీఎం అన్నారు." అని ఒవైసీ వివరించారు.
ఎన్‌ఆర్‌సీకి మొదటి అడుగే ఎన్‌పీఆర్...
ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వేర్వేరు కాదని అసదుద్దీన్ తెలిపారు. ఎన్‌ఆర్‌సీకి మొదటి అడుగే ఎన్‌పీఆర్ అన్నారు. అమిత్ షా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ నివేదికలు, పత్రాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
నా పౌరసత్వాన్ని నిర్ధరించే వారు ఎవరు?
దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం చెబుతోందని, తన పౌరసత్వాన్ని నిర్ధరించే వారు ఎవరని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. రాష్ట్రంలో 29 శాతం మందికే జన్మ ధ్రువపత్రాలు ఉన్నాయని ఆర్టీఐ ద్వారా తేలిందని, మిగతా వ్యక్తులు, వారి తల్లిదండ్రులు పుట్టిన వివరాల కోసం ఏం చేయాలని అన్నారు. పౌరసత్వాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎన్‌పీఆర్ చేపడుతున్నారని పేర్కొన్నారు.