కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో అఖిల భారత రైతు పోటారాల సమన్వయ కమిటీ - ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ రంగం, రైతు వ్యతిరేక చట్టాలకు ప్రత్యామ్నాయంగా ఏపీఎంసీ చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ... ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం చెల్లించడం, అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లాక్‌డౌన్ అదనుగా చూసుకుని వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలను తెచ్చిందని ఆరోపించారు. దీంతో వ్యవసాయ రంగం క్రమంగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లి రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో చేపట్టిన ఛలో దిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.