మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ 'తన ముద్దుల అన్నయ్య' అని అంటూనే ఆయన మాటలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. యురేనియంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్షం సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు చెప్పిన పార్టీ స్టాండ్ తప్పని అభిప్రాయపడ్డారు.
ఆయనకు యురేనియం ఊసెందుకు...
యురేనియంపై సంపత్‌కు ఏబీసీడీలు తెలియవని రేవంత్‌రెడ్డి అనడం సరికాదన్నారు. కార్యవర్గ సమావేశంలో తాను ఏం మాట్లాడానో తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి స్పందించి ఉంటే బాగుండేదన్నారు. రేవంత్‌లా అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని, ఆధారాలు లేకుండా తానేం మాట్లాడనని అందరికీ తెలుసని చెప్పారు. సంపత్, వంశీలకు యురేనియం సమావేశంలో ఏంపని అని రేవంత్ అన్నారని.. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌కు యురేనియంపై ఏంపని.. అంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
పవన్‌కల్యాణ్‌తో సెల్ఫీలా..
గతంలో యురేనియంపై దిల్లీలో అటవీశాఖ డీజీని కలిసి ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. ఏబీసీడీలు తెలియకుండా యురేనియంపై హస్తిన దాకా పోలేదన్నారు. అసలు అఖిల పక్ష సమావేశానికి రేవంత్‌రెడ్డికి ఆహ్వానం లేదని.. నాదెండ్ల మనోహర్‌కు ఫోన్ చేసి అడిగి మరీ రేవంత్‌రెడ్డి పిలిపించుకున్నారని ఆరోపించాడు. పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం లేదన్న సంపత్.. రాష్ట్రవ్యాప్తంగా తనతోనే స్వీయచిత్రాలు దిగేవారు చాలా మంది ఉన్నారన్నారు. పవన్‌కల్యాణ్‌కు రేవంత్‌రెడ్డి.. మూడు కాగితాలు ఇచ్చారేమో.. నేను ఇవ్వాలనుకుంటే ముప్పై కాగితాలున్నాయని పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ ఎంపీగా ఉండి.. పవన్‌కు నివేదిక ఇవ్వడమేంటని తాను అనడంలో తప్పేంముందని ప్రశ్నించారు.