తమ డబ్బుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న వీరికి చివరికి నిరాశే మిగిలింది. బాధితుల సొమ్ము తామే చెల్లిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ ప్రకటించటంతో పాటు అధికారంలోకి వచ్చాక రూ.10 వేల లోపు డిపాజిట్ చేసినవారిలో అధికశాతం మందికి డబ్బులివ్వడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. రెండేళ్లు గడుస్తున్నా రూ.10 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి చెల్లింపులు చేయకపోవటంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారంతా ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు.
- రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన ఖాతాదారులు 13 లక్షలు. వీరికి చెల్లించేందుకు రూ.1,150 కోట్లు అవుతుందని అంచనా.
- వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు చెల్లించారు.
- 20వేల లోపు కట్టిన బాధితుల్లో సాయం పొందాల్సినవారు 9.64 లక్షల మంది. వీరికి రూ.916 కోట్ల వరకూ ఇవ్వాలి.
- రూ.20 వేల కంటే ఎక్కువ కట్టిన వారినీ పరిగణనలోకి తీసుకుంటే మరో 6 లక్షల క్లెయిములు ఉన్నాయి. వాటికీ చెల్లించాలంటే మరో రూ.3,710 కోట్లు అవసరం.
కేటాయింపులు ఘనం.. ఇచ్చింది స్వల్పమే
- రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపుల కోసం తొలి బడ్జెట్‌లో (2019-20) వైకాపా ప్రభుత్వం రూ.1,150 కోట్లు కేటాయించింది. ఆ మొత్తం నుంచి రూ.10 వేల లోపు కట్టిన వారికి చెల్లించేందుకు మొదటిదశలో రూ.263.99 కోట్లు విడుదల చేసింది. 2019 నవంబరు 7న గుంటూరులో జరిగిన సభలో 3,69,655 మందికి ఆన్‌లైన్ చెల్లింపును ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
- అందులో 3.36 లక్షల మందికి రూ.234 కోట్లు అందాయని, మిగతా బాధితులకు సొమ్ములు పడలేదని, అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం చెబుతోంది. ఆ లెక్కన రూ.10 వేల లోపు డిపాజిట్ చేసుకున్న వారిలోనే మరో 33 వేల మందికి రూ.30 కోట్ల వరకూ అందాలి.
- 2020-21 బడ్జెట్‌లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.200 కోట్లు కేటాయించారు. డిసెంబరులో చెల్లిస్తామని ఆ ఏడాది మేలో విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్‌లో తెలిపారు. అయినా చెల్లించలేదు.
- 2021-22 బడ్జెట్‌లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్‌లో పేర్కొన్న ప్రకారం ఆగస్టులో చెల్లించాలి.
జగన్ హామీలు అప్పుడు.. ఇప్పుడు..
- బడ్జెట్‌లో రూ.1,110 కోట్లు కేటాయించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అసెంబ్లీలో చాలాసార్లు కోరాను. ఇలా చేస్తే 80% బాధితులకు మేలు జరుగుతుందని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1,100 కోట్లు కేటాయించి బాధితులకు న్యాయం చేస్తాం. 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఘోష చంద్రబాబుకు పట్టదా? - 2018 జూన్ 5న ప్రజాసంకల్ప యాత్రలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు బహిరంగ సభలో..
- అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్లు కేటాయించి, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 13 లక్షల మంది బాధితులకు వెంటనే మేలు చేస్తాం. మిగతా వారికి త్వరితగతిన పరిష్కారం చూపిస్తాం. - వైకాపా ఎన్నికల ప్రణాళికలో హామీ
- ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికీ చెల్లిస్తాం. ఖాతాదారులు ఆందోళన చెందక్కర్లేదు. త్వరలోనే రూ.10-20 వేల మధ్య డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లిస్తాం. న్యాయస్థానం అనుమతించిన జాబితాలోని అందరికీ డబ్బులిస్తాం. - 2019 నవంబరు 7న చెక్కుల పంపిణీ సందర్భంగా గుంటూరులో ముఖ్యమంత్రి హోదాలో...
టీకొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునే పాత్రుని రాముది శ్రీకాకుళం జిల్లా సోంపేట. భవిష్యత్తు అవసరాల కోసం అగ్రిగోల్డ్‌లో రోజుకు రూ.30 చొప్పున రూ.12,000 కట్టారు. ఒప్పందం ప్రకారం కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ అతనికి రూ.13,500 తిరిగి చెల్లించాలి. వారు బోర్డు తిప్పేయటంతో కష్టార్జితమంతా పోయింది. ‘రోజంతా కష్టపడితే వచ్చిన దాంట్లో దాచుకున్న సొమ్ము అది. ఆరేళ్లుగా నా సొమ్ము కోసం కాళ్లరిగేలా తిరిగాను. ఒక్క రూపాయైనా చేతికందలేదు’ అని రాము ఆవేదన వ్యక్తం చేశారు.
కుమార్తె పెళ్లి చేయలేక ఇబ్బంది పడుతున్నా...
లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. అగ్రిగోల్డ్‌లో రూ.2.50 లక్షలు డిపాజిట్ చేశాను. ఆరేళ్ల తర్వాత రూ.6 లక్షలు ఇవ్వాలి. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్ల పెళ్లి కోసం దాచి, మొత్తానికే మోసపోయాను. ఎలాగో పెద్దమ్మాయి పెళ్లి చేశాను. రెండో అమ్మాయికి చేయటానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. నేను దాచుకున్న సొమ్ము చేతిలో ఉంటే ఇప్పుడిన్ని సమస్యలు ఉండేవి కాదు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి అందలేదు. కొవిడ్ ప్రభావంతో లారీ పరిశ్రమ బాగా దెబ్బతింది. అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకురావాల్సి వస్తోంది.
చిన్న గదిలో అల్పాహారశాలతో జీవనం కొనసాగించే పరమేశ్వరప్పది కర్నూలు జిల్లా ఆత్మకూరు. విడతల వారీగా అగ్రిగోల్డ్‌లో రూ.2.20 లక్షలు డిపాజిట్ చేశారు. ఆ సంస్థ మోసగించటంతో అతని పరిస్థితి తలకిందులైంది. 2019 నవంబరులో ఒక బాండుపై ప్రభుత్వం రూ.10 వేలు చెల్లించింది. ఇంకా రూ.2.10 లక్షలు రావాలి. ‘నా భార్య మందులు, ఇతర వైద్యఖర్చులకే నెలకు రూ.3 వేలు ఖర్చవుతోంది. అక్కడ వేసిన డబ్బులు ఇప్పుడు ఉంటే ఎంతో ఆసరాగా ఉండేది’ అని పరమేశ్వరప్ప వాపోయారు.
వారంలో ఇస్తామన్నారు.. 100 వారాలు గడిచిపోయాయి