తెలంగాణ

telangana

ETV Bharat / city

'లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం నిలిచే దిశగా చర్యలు' - మంత్రి నిరంజన్​రెడ్డి తాజా వార్తలు

NIRANJAN REDDY REVIEW ON AGRI ACTIVITIES: రాష్ట్రంలో అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం నిలిచే దిశగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో పరిశోధనలు వేగవంతం చేసున్నామని చెప్పారు. హైదరాబాద్​లోని తన కార్యాలయంలో ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, అవి రైతులకు మరింత చేరువకావడం కోసం తీసుకోవాల్సిన అంశాలపై మంత్రి సమీక్షించారు.

NIRANJAN REDDY REVIEW ON AGRI ACTIVITIES
వివిధ శాఖల అధికారులతో మంత్రి నిరంజన్​రెడ్డి సమీక్ష

By

Published : Feb 9, 2022, 11:35 AM IST

NIRANJAN REDDY REVIEW ON AGRI ACTIVITIES: రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్, సహకార శాఖలు, విశ్వవిద్యాలయాలు, అనుబంధ శాఖల కార్యకలాపాల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం విస్తృతంగా చర్చించారు. అత్యధిక లాభసాటి ఉపాధి రంగంగా వ్యవసాయం నిలిచే దిశగా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పంటల వైవిధ్యీకరణతోపాటు వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో పరిశోధనలు వేగవంతం చేసున్నామని చెప్పారు. అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్న దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌లో తెలంగాణ పత్తి పరిశోధనా కేంద్రం తక్షణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న తరుణంలో మౌలిక వసతుల కల్పన, పరిశోధనకు సహకారం అందిస్తామన్నారు.

మన దగ్గరే కంది విత్తన పరిశోధన కేంద్రం...

దేశంలో నాణ్యమైన అధిక దిగుబడులిచ్చే కంది పంట అభివృద్ధి కోసం తాండూరులో కంది విత్తన పరిశోధనా కేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి పరచనున్నామని తెలిపారు. వ్యవసాయంలో తెలంగాణకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గుర్తించి ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలని సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కేసీఆర్ గతంలో చెప్పినట్లుగా పంట కాలనీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అరటి, మిరప, విత్తన పత్తి, కంది, మామిడి, బంగాళాదుంప, ఇతర కూరగాయల సాగుకు గల అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ కాకుండా రాష్ట్రంలో ఇతర పట్టణాలు, కార్పొరేషన్ల పరిధిలో కూరగాయల సాగు ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

"ఆయిల్ పామ్‌ సాగులో నారు మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యత పరిశీలించడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నాం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణకు ఆదేశాలు జారీ చేశాం. బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు ఆదేశాలు ఇచ్చాం. సిద్దిపేటలో 60 ఎకరాలు, మహబూబాబాద్‌లో 84 ఎకరాల్లో ఆయిల్‌ఫెడ్ సంస్థ ద్వారా మరో 2 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నందున ఆరు నెలల్లో ఈ 4 ఫ్యాక్టరీలు అందుబాటులోకి తీసుకొస్తాం. 4 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలన్న లక్ష్యంలో భాగంగా వివిధ జిల్లాల్లో నర్సరీలు ఇదివరకే ప్రారంభించాం. వచ్చే వానాకాలంలో లక్షల ఎకరాల్లో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం." - నిరంజన్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, టీఎస్ సీడ్స్ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పీజేటీఎస్‌ఏయూ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Minister KTR on Nala Safety Audit : 'నాలాల ప్రమాదాలకు అధికారులే బాధ్యులు'

ABOUT THE AUTHOR

...view details