వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం జర్మనీలో పర్యటిస్తోంది. రెండో పర్యటనలో భాగంగా జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల ప్రతినిధి బృందంతో... మంత్రి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ కార్యక్రమంలో జర్మన్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం ప్రతినిధులు, జీఎఫ్ఏ, కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. మంత్రితోపాటు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర రావు, విత్తనాభివృద్ది సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఉన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు విత్తనోత్పత్తి, ధ్రువీకరణలో సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంచామని మంత్రి బృందం వివరించింది.
విత్తన ధృవీకరణలో సహకారం కావాలి
అంతర్జాతీయ విత్తన ధృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులు ప్రోత్సహించి, విత్తన వాణిజ్యం పెంపొందిస్తున్నామని ప్రకటించారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి రైతులు పాటించవలసిన మెళకువలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై, ప్రాంతీయ భాషలో పలు ప్రచురణలు తయారు చేసి, విత్తన రైతులకు పంపిణీ చేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కొత్త విత్తన విధానం, విత్తన కౌన్సిల్, అంతర్జాతీయ విత్తన సలహామండలి, ఓఈసీడీ అంతర్జాతీయ విత్తన ధృవీకరణ అంశాల్లో జర్మన్ వ్యవసాయ శాఖ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమీపంలోని బండమైలారంలో గల 150 ఎకరాల్లోని విత్తనపార్కులో పరిశోధన సంస్థలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, శీతల గిడ్డంగులు ఉన్నాయని మంత్రి బృందం... జర్మన్ బృందానికి తెలిపింది.