సుధర్ఘ కసరత్తు అనంతరం తెలంగాణ సర్కార్.. సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం ధరణి పోర్టల్‌ను అధికారికంగా గురువారం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో సుమారు 2.6 కోట్లకు పైగా ఆస్తుల వివరాలు లభ్యం కానున్నాయి. క్రయవిక్రయాలతో పాటు వివిధ సేవలకు ఈ పోర్టల్‌నే వేదికగా మార్చింది. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో ఆగిన రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లన్నీ తహసీల్దార్ కార్యాలయాల్లోనూ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేసేలా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.
పాసుపుస్తకం, 1బి. పహాణీ
పట్టాదారు పాసుపుస్తకం నంబరు లేదా జిల్లా, మండలం, గ్రామం ఖాతా సంఖ్య లేదా సర్వే నంబరు/సబ్‌డివిజన్ సంఖ్య నమోదు చేస్తే భూములు వివరాలు వస్తాయి. ఇందులో పట్టాదారు పాసుపుస్తకం, 1బి నమూనా (ఆర్ఓఆర్), పహాణి/అడంగళ్లు ఉంటాయి.
ప్రభుత్వ భూముల గుర్తింపు
జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదు చేస్తే.. గ్రామ పరిధిలో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు, లావుణిపట్టా, కెనాల్/కాలువ, శ్మశానం, రోడ్డు, సీలింగ్ పట్టా భూమి స్వభావం, వర్గీకరణ వివరాలు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్ విలువ
జిల్లా, మండలం, గ్రామం, సర్వే/సబ్‌డివిజన్ నంబరు వంటి వివరాలను నమోదు చేస్తే మార్కెట్ విలువ ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఆన్లైన్లో ఈసీ
ధరణి పోర్టల్‌లో ఈసీ కూడా ఆన్లైన్లో ఉండటంతో నిర్దేశించిన భూమిపై రుణం/తనఖా వంటివి స్పష్టంగా తెలుస్తాయి. పంట రుణం/ హైపోథికేటెడ్ (తనఖా), లోన్అకౌంట్ నంబరు, రుణం తీసుకున్న తేదీ, రుణం కాలపరిమితి, రుణ మొత్తం, ఏ బ్యాంకు అనే వివరాలతో పాటు లోన్ స్టేటస్ వంటి వివరాలున్నాయి. రుణాలు పొందేటపుడు, క్రయవిక్రయాల సమయంలో సమాచారం దాచడానికి వీలుపడదు.
ధరణి ప్రత్యేకతలు
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఒకేచోట
పారదర్శకత, జవాబుదారీతనం
రికార్డులను స్వయంగా పరిశీలించుకునే అవకాశం
కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాటు