యూరియా కొరత ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే రాష్ట్రంలో యూరియా కొరతపై విపక్షాలది పూర్తిగా అసత్య ప్రచారం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎక్కడా కూడా యూరియా కొరత లేదని... క్షేత్రస్థాయిలో నాలుగు జిల్లాల్లో ఆయన పరిశీలించినట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు, వేలిముద్ర విధానంతో క్యూలో రైతులు నిలబడాల్సి వస్తుందన్నారు. రాష్ట్రమంతా ఒకేసారి వచ్చిన వర్షాలతో... గతం కన్నా సాగు పెరిగి యూరియాకు డిమాండ్ పెరిగిందని మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
త్వరగా రవాణా...
చరిత్రలో తొలిసారి రోజుకు సగటున 12 వేల టన్నుల యూరియా తరలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 1 నుంచి శుక్రవారం వరకు లక్షా 28 వేల 277 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతోందన్నారు. గుజరాత్ క్రిబ్‌కో హజీరా ప్లాంట్ నుంచి 6 వేల టన్నులు 36 గంటల్లోనే రవాణా చేసినట్లు తెలిపారు. గతంలో మూడు రోజుల సమయం పట్టేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుంచి 48 గంటల సమయం పట్టగా... నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో 24 గంటల లోపు రేక్ పాయింట్లకు యూరియా చేరుకుంటుందని తెలిపారు.
రోడ్డు మార్గంలో రికార్డు...
రోడ్డు మార్గంలో రికార్డు స్థాయిలో 4 రోజుల్లో 5700 టన్నులు తరలించినట్లు వెల్లడించారు. యూరియా రవాణాలో తెలంగాణ ప్రభుత్వ రికార్డు సాధించిందని ఘనంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో తన పర్యవేక్షణలో రైల్వే, పోర్టు, రవాణా అధికారులు కదిలారని అన్నారు. మరో 18వేల 200 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల నుంచి లోడింగ్‌కు సిద్ధంగా ఉన్నదని... ఈ నెల 15 వరకు రాష్ట్రంలో కేటాయించిన వివిధ రేక్ పాయింట్లకు చేరుకుంటుందని ప్రకటించారు.
అధిక ధరలపై కొరడా...
రాష్ట్రంలోని 31 జిల్లాలలో సగటున 700 మెట్రిక్ టన్నుల యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. గతేడాది వానాకాలం సీజన్‌లో 6 లక్షల 72 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకే 7లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు స్పష్టం చేశారు. యూరియా సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యసు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి : కాంగ్రెస్ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు