Protest on schools merge: ఏపీలోని అనంతపురం జిల్లా మాయదారులపల్లలో విద్యార్థులతో కలిసి తల్లితండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల విలీనాన్ని నిరసిస్తూ ప్రధాన ద్వారం వద్ద ముళ్ల కంచెలు వేసి గేటుకు తాళం వేశారు. ప్రాథమిక పాఠశాలను పక్కనే బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల 4 కిలోమీటర్ల దూరం తమ పిల్లలు నడవలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి ప్రాథమిక పాఠశాలను కూడా వేపులపర్తి ఉన్నత పాఠశాలలో విలీనం చేయకూడదని రెండో రోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో తమ పాఠశాలను మూసివేయొద్దంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. చదువుతున్న పాఠశాలను వదిలేసి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నినాదాలతో హోరెత్తించారు.
పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేషన్‌పాడుల విద్యార్థులతో కలిసి మహిళలు ధర్నా చేపట్టారు. తమ కాలనీ నుంచి పాఠశాలను తరలించవద్దని ఆందోళన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం పిండ్రువడ పాఠశాలను అంబావిల్లి పాఠశాలలో విలీనం చేయడంతో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దూరాభారం వల్ల విద్యార్థులను చదువు మాన్పించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం తిమ్మయ్య గారి పల్లె పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పాఠశాల బయటే కూర్చుని నిరసన తెలియజేశారు. పాఠశాల విలీన ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించు కోవాలని నినాదాలు చేశారు.
నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బలో పాఠశాలకు తల్లితండ్రులు తాళం వేసి ఆందోళన చేపట్టారు. విలీనం పేరుతో జెండాదిబ్బా గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాలను, ఉర్దూ పాఠశాలను అన్నారెడ్డిపాళేం పాఠశాలకు తరలించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరం విద్యార్థులు నడిచి వెళ్లలేరని మండిపడ్డారు. వరికుంటపాడు మండలం కాకోలువారిపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకించారు.