దాదాపు మూడు నెలలు విరామం తరువాత వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేసేందుకు వీలుగా సంస్కరణలు తీసుకొచ్చేందుకు సెప్టెంబరు 8న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిలిపివేసింది. ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటికీ... ఇదే విధానంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయం వచ్చేప్పటికి ఈ విధానంపై న్యాయస్థానంలో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభించింది. ఇందుకోసం మూడు రోజుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేసింది.
స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి వచ్చినందున... ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ఆన్‌లైన్ ద్వారా సంబంధిత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి సమాచారం ఇచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రక్రియ మొదలైనందున... ఒక్కో రిజిస్ట్రేషన్‌కు అరగంట పడుతుందన్న అంచనాతో సమయం కేటాయించారు. ఇవాళ అమావాస్య కావడం వల్ల బుకింగ్‌లు తక్కువగా అయ్యాయని అధికారులు చెబుతున్నారు. రేపటి నుంచి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే మొదట ఈ-పాస్‌బుక్ ఇచ్చి... మరో వారం, పది రోజుల్లో పట్టాదారు పాస్తు పుసకాల మాదిరిగా వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేకంగా మెరూన్ రంగులో పాస్ పుస్తకం ఇవ్వనున్నట్టు తెలిపారు.