కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం 3వ దశ కొనసాగుతోంది. ఇది ఈ నెల 17తో ముగుస్తుంది. సడలింపులతో నాలుగో దశ లాక్‌డౌన్ అమలయ్యే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి ఉద్ధృతం అవుతున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటివరకు ఎంత బాధ్యతగా ఉన్నారో ఇకపై అదే విధంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. పౌరులందరూ ప్రభుత్వానికి సహకరించి సూచనలు పాటిస్తే... కరోనాపై చేస్తున్న ఈ యుద్ధంలో విజయం వరిస్తుంది.
సామాజిక బాధ్యత అంటే ఇదే..
బాధ్యతగా ఉండటమంటే.. అకారణంగా బయటకు వచ్చి ఇబ్బందులకు గురి చేయక పోవటమే..! ప్రస్తుతం ఇంతకు మించిన సామాజిక బాధ్యత ఇంకేదీ లేదు. కరోనా కాలంలో స్వీయ నియంత్రణ అనేది ఎంత ముఖ్యమో వైద్య నిపుణులంతా చెబుతూనే ఉన్నారు. నిత్యావసరాల కోసం తప్ప బయటకు రాకూడదు. సరకులు, కూరగాయల కోసం వచ్చినప్పుడూ భౌతికదూరం పాటించటం తప్పనిసరి. కొన్ని చోట్ల ఈ నిబంధనలు పాటిస్తున్నా.. మరికొన్ని చోట్ల సూచనలు గాలికొదిలేస్తున్నారు. గుంపులు గుంపులుగా మార్కెట్లకి తరలివచ్చి భయాందోళనలు పెంచుతున్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న తరుణంలో ఇలా వ్యవహరించటం...ఎంతో ప్రమాదకరం.