తెలంగాణ

telangana

ETV Bharat / city

మతిస్థిమితం లేనివాడనుకున్నారు.. ఏకంగా డీఎస్సీ పోస్టు కొట్టేశారు.. - srikakulam latest news

Kedareshwara Rao: 23 ఏళ్ల క్రితమే డీఎస్సీకీ ఎంపికైన ఆయన.. సకాలంలో నియామకాలు జరగకపోవడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఉన్నతస్థాయికి ఎదగాల్సిన ఆ వ్యక్తి నిస్సహాయంగా తిరుగుతూ పిచ్చోడనే ముద్ర వేయించుకున్నారు. ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ.. ఆర్థిక భారంతో.. దీనావస్థలోనే జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం 1998 డీఎస్సీ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తూ చేసిన ప్రకటనలో ఆయన పేరు ఉంటడం స్థానికంగా సంచలనమే రేపింది. ఆయన గతం తెలియని వారంతా ఇప్పుడు అభినందనలతో ముంచెత్తుతున్నారు. 23 ఏళ్ల తన కల నెరవేరడంతో.. ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరదామా అని ఆయన ఎదురుచూస్తున్నారు.

Kedareshwara Rao
కేదారేశ్వరరావు

By

Published : Jun 21, 2022, 11:51 AM IST

Kedareshwara Rao: 23 ఏళ్ల క్రితమే డీఎస్సీకి ఎంపికయిన అభ్యర్థి మతిస్థిమితం లేని వ్యక్తిలా తిరుగుతున్నాడు. అన్నీ కలిసి వచ్చి ఉంటే.. అప్పటికే ఉపాధ్యాయ వృత్తి చేపట్టి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన వారు. కొన్ని కారణాల రీత్యా నియామకాలు జరగకపోవడంతో ఆశగా ఎదురుచూశారు. ఎంతకీ ఉద్యోగం దక్కకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహల్లో మునిగిపోయారు. దాదాపు ఎనిమిదేళ్లుగా మతిస్థిమితం లేని వ్యక్తిలా ఇదే అవతారంలో గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇతడి విద్య నేపథ్యం ఏంటో చాలా మంది గ్రామస్తులకు కూడా తెలియదు. 1998 డీఎస్సీకి ఎంపికయిన అభ్యర్థుల్లో ఈయన పేరు కూడా రావడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. ఆయన గొప్పదనమేంటో ఆ చుట్టుపక్కల గ్రామాలకూ తెలిసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందిస్తున్నారు.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఈయన పేరు కేదారేశ్వరరావు. ఉన్నత విద్య అభ్యసించి బీఈడీ పూర్తిచేశారు. ఉపాధ్యాయ వృత్తి చేజిక్కించుకోవాలని తపించారు. 1994, 1996లో డీఎస్సీ పరీక్ష రాసినా.. ఎంపిక కాలేదు. పట్టువదలకుండా శ్రమించిన కేదారేశ్వరరావు.. 1998లో మళ్లీ డీఎస్సీ రాసి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలన్న తన కల నెరవేరబోతోందని సంతోషించారు.

కొన్ని కారణాల వల్ల 1998 డీఎస్సీ నియామకాలు సకాలంలో జరగలేదు. వాయిదా పడుతూనే వచ్చాయి. చేతి దాకా వచ్చిన ఉద్యోగం రేపో, ఎల్లుండో దక్కకపోదా అనే ఆకాంక్షతో.. అందరు అభ్యర్థుల్లాగే కేదారేశ్వరరావు ఎదురుచూస్తూ వచ్చారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆయన కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదరించేవారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత కాలం ఆటో నడుపుకుంటూ.. ఆ తర్వాత మరికొన్ని చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీశారు.

కష్టపడి సాధించిన ఉద్యోగంలో చేరే అవకాశాలు సన్నగిల్లుతుండటంతో.. తీవ్ర మనస్తాపానికి గురవుతూ వచ్చారు కేదారేశ్వరరావు. దాదాపు 8 ఏళ్లుగా.. నిస్సహాయంగా గ్రామాల్లో తిరుగుతుండేవారు. ఆయన స్థితిని చూసి ఓ మతిస్థిమికం లేని వ్యక్తిగా ముద్రవేశారు. ఈయన ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థి అన్న విషయం ఎవరికీ తెలియదు. ఇటీవల 1998 డీఎస్సీలో అభ్యర్థుల జాబితా సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో కేదారేశ్వరరావు పేరు కూడా ఉండటం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానికులు, యువత ప్రశ్నించగా.. కేదారేశ్వరరావు తన చరిత్ర అందరికీ చెప్పుకున్నారు. తన ఇంట్లో భద్రంగా దాచుకున్న.. డిగ్రీ, బీఈడీ సహా విద్యకు సంబంధించిన ఇతర ధ్రువపత్రాలను చూపించారు. కేదారేశ్వరరావు గతం తెలుసుకున్న స్థానిక యువత.. ఆయన్ని సన్మానించారు. కేక్‌ కట్ చేసి అభినందించారు. కొత్త దుస్తులు, మొబైల్‌ఫోన్‌, బూట్లు అందజేశారు.

23 ఏళ్ల తన స్వప్నం ఇప్పుడు సాకారమయిందని.. కేదారేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగంలోకి పిలుస్తారా అని వేచిచూస్తున్నట్లు తెలిపారు. నిరీక్షణకు తెరదించి.. త్వరగా ఉద్యోగం కేటాయించాలని కేదారేశ్వరరావు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details