social media posts against judges case: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న ట్విట్టర్.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జడ్జిలపై వ్యాఖ్యలు ఇక నుంచి కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పూర్తి వివరాలు తెలిపామని కోర్టుకు తెలిపారు. అఫిడవిట్‌లో చెప్పినవి నిజమో కాదో చూడాలని న్యాయస్థానం.. సీబీఐని ఆదేశించింది. మెమో దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
చర్యలపై హైకోర్టు ఆదేశాలు..
గత విచారణ సందర్భంగా సామాజిక మాధ్యమాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించే వ్యవహారంలో సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయస్థానంతో దోబూచులాడుతున్నాయని ఆక్షేపించింది. అభ్యంతరకర యూఆర్ఎల్ లను(యూనిఫాం రిసోర్స్ లొకేటర్) తొలగించాలని సీబీఐ కోరితే 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాద్యమ కంపెనీలపై మండిపడింది.